అభిమాన హీరోను కలిసేందుకు ఎంత దూరమైనా వెళ్తారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరోతో ఒక్క ఫొటో దిగితే జన్మధన్యం అనుకుంటారు. ఈ పిచ్చిని క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు కృష్ణ శర్మ అనే వ్యక్తి. అనుకున్నదే తడవుగా పథకం అమలు పరిచాడు. ఏకంగా 82 లక్షలు కొట్టేశాడు.
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ను కలిపిస్తానని ఐశ్వర్య అనే మహిళకు మాయమాటలు చెప్పాడు కృష్ణశర్మ. తను ఓ సినిమా తీస్తున్నానని, అందులో డబ్బు పెడితే, కార్తీక్ ఆర్యన్ తో డిన్నర్ డేట్ ఏర్పాటు చేస్తానని, మరోవైపు తన సినిమా ద్వారా వచ్చే లాభాలు కూడా అందుకోవచ్చని ఊరించాడు.
అతడి మాటలు నమ్మి ఐశ్వర్య డబ్బులు పెట్టింది. ఇదంతా జరిగి రెండేళ్లు అవుతోంది. కృష్ణ శర్మ మోసగాడని గ్రహించడానికి ఆమె ఇంత టైమ్ పట్టింది. ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు, బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో అతడ్ని అరెస్ట్ చేశారు.
కట్ చేస్తే, అతడు ఈ తరహా మోసాల్ని చెన్నై, ఢిల్లీలో కూడా చేసినట్టు గుర్తించారు. అంతేకాదు, అక్కడ పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ అతడిపై కేసులున్నాయి. కృష్ణశర్మతో పాటు మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ మొదలుపెట్టారు పోలీసులు.