విశాఖ తరువాత ఆ క్రెడిట్ అనకాపల్లి తీసుకుంది. నాన్ లోకల్స్ కి చోటు ఇచ్చేసింది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ మూడు లక్షలకు పైగా భారీ మెజారిటీతో అనకాపల్లి నుంచి ఎంపీగా మంచి విజయం సాధించారు. 2009లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో పాటు ఒక ప్రముఖ దిన పత్రిక యజమాని అనకాపల్లి నుంచి ఎంపీ సీటు కోసం పోటీ చేస్తే జనాలు నాన్ లోకల్స్ ని నో చెప్పేశారు.
దాంతో ఈసారి కూడా లోకల్స్ కే పట్టం కడతారు అని అంతా అనుకున్నారు. ఆ దిశగానే అంచనాలు విశ్లేషణలు వినిపించాయి. పైపెచ్చు సీఎం రమేష్ కొత్త ఆయన పార్టీ గుర్తు కమలం కొత్త ఎలా అని అనుకున్నారు. కానీ జనాలలో రాజకీయ చైతన్యానికి పరాకాష్టగా అనకాపల్లి ఎంపీ ఎన్నిక జరిగింది. దాంతో సీఎం రమేష్ ని సొంత వారిలాగానే ఈ గ్రామీణ నేపధ్యం పూర్తిగా ఉన్న ఎంపీ సీటు ఆదరించింది.
ఇక మీదట విశాఖతో పాటు అనకాపల్లి నుంచి కూడా ఎంపీలుగా పోటీ చేయడానికి స్టేట్ లో ఎక్కడ నుంచి ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అన్న సత్యాన్ని కూడా తెలియచెప్పింది. సీఎం రమేష్ రిస్క్ చేసి పోటీ చేశారు అనుకున్నారు కానీ ఆయన జనాల నాడి పట్టుకునే బరిలోకి దిగారు అని ఫలితాల తరువాత అంతా అనుకునే మాట.
ఎన్నికలు అంటే 2009 వేరు 2024 వేరు అన్నది కూడా నిరూపితం అయింది. ఒకవేళ లోకల్ ఫీలింగ్ అన్నది పదిహేనేళ్ళ క్రితం జనాల్లో ఉన్నా ఇపుడు మాత్రం అలాంటివి జాంతానై అంటూ జనాలు సీఎం రమేష్ కి జై కొట్టేశారు. సీఎం రమేష్ బిగ్ విక్టరీ కొట్టారు. అనకాపల్లి ఆదరణను అభిమానాన్ని చూసారు.
ఆయన ఇక మీదట లోకల్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంది. ఆయన అనకాపల్లిలో నివాసం ఉంటే బాగుంటుందని అంతా అంటున్నారు. ఆయన పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీకి వెళ్ళినా ఎంపీగా ప్రజల కోసం స్థానికంగా ఉంటే ఆయనతో పాటు బీజేపీకీ రాజకీయంగా మేలు జరుగుతుందని అంటున్నారు.