అరాచ‌కంలో వైసీపీకి మించిపోతున్న టీడీపీ

మొన్న‌టి వ‌ర‌కు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ అరాచ‌కాల‌కు పాల్ప‌డింద‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేశారు. అరాచ‌కం పోవాలంటే కూట‌మిని గెలిపించాల‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఊద‌ర‌గొట్టారు. కార‌ణాలేవైనా కూట‌మికి…

మొన్న‌టి వ‌ర‌కు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ అరాచ‌కాల‌కు పాల్ప‌డింద‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేశారు. అరాచ‌కం పోవాలంటే కూట‌మిని గెలిపించాల‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఊద‌ర‌గొట్టారు. కార‌ణాలేవైనా కూట‌మికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతి నెల‌కుంటుంద‌ని ఆశించిన వారికి నిరాశే ఎదుర‌వుతోంది.

వైసీపీకి ప‌దింత‌లు తాము అరాచ‌కానికి పాల్ప‌డుతామ‌ని ముఖ్యంగా టీడీపీ నేత‌లు ఆచ‌ర‌ణ‌లో చూపుతున్నారు. అక్క‌డ‌క్క‌డ జ‌న‌సేన నేత‌లు సైతం అదే పంథాలో న‌డ‌వ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. గ‌తంలో అధికార అండ చూసుకుని అరాచ‌కాల‌కు పాల్ప‌డిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై టీడీపీ దాడుల‌కు పాల్ప‌డ‌డంలో త‌ప్పు లేద‌ని కూట‌మి అనుకూలురు వాదించొచ్చు. వైసీపీ చేసిన త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు దారుణ శిక్ష విధించార‌నే సంగ‌తిని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు విస్మ‌రించొద్ద‌నే హెచ్చ‌రిక పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది.

టీడీపీ వేధింపుల‌కు తాళ‌లేక దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం పెద‌వేగి మండ‌ల వైసీపీ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై పెద్ద ఎత్తున దాడులు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. వైసీపీ అధికార ప్ర‌తినిధి నాగార్జున‌యాద‌వ్‌పై ఒక హోట‌ల్‌లో టీడీపీ నేత‌లు దాడికి ప్ర‌య‌త్నించారు. ఇలాంటి చ‌ర్య‌లు టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు రుచించొచ్చు. కానీ మంచి చేస్తార‌ని అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన సామాన్య ప్ర‌జ‌లు అంగీక‌రించ‌రు.

ఈ విష‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మెచ్చుకోవాలి. క‌నీసం త‌న పార్టీ కేడ‌ర్‌కు ప్ర‌తీకార చ‌ర్య‌ల‌పై వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఇచ్చింది సేవ చేయ‌డానికే త‌ప్ప‌, ప్ర‌త్య‌ర్థుల‌పై దాడులు చేసేందుకు కాద‌ని స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన నాయ‌కులు ఓవరాక్ష‌న్ చేస్తున్నారు. గుంటూరులో హాస్ట‌ల్ య‌జ‌మానిపై దాడికి తెగ‌బడ్డారు. అత‌న్ని మోకాళ్ల‌పై నిల‌బెట్టి మ‌రీ హింసించారు. హోట‌ల్ య‌జ‌మానితో కాళ్లు ప‌ట్టించుకున్నారు.

గ‌తంలో వైసీపీ ఒక త‌ప్పు చేస్తే, తాము ప‌ది త‌ప్పులు చేస్తామ‌న్న‌ట్టుగా అధికార పార్టీల నేత‌ల వైఖ‌రి వుంది. ఈ దాడులు ఇలాగే కొన‌సాగితే మాత్రం రానున్న రోజుల్లో త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంద‌ని గ్ర‌హిస్తే మంచిది. అన్నిటికంటే కాలం అత్యంత శ‌క్తిమంత‌మైంది. అంద‌రి స‌ర‌దాల‌ను తీరుస్తుంది. ఇంకా ఏపీలో కూట‌మి అధికారం చేప‌ట్ట‌క‌నే, దాని తాలూకూ అరాచ‌కాలు మొద‌ల‌య్యాయ‌నే భావ‌న‌కు బీజం ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.