ఓటింగ్ సరళి ఎలా జరిగింది అన్నది తరువాత తరువాత అంచనాకు అందుతుంది. కానీ ఈలోగా క్లారిటీగా తెలుస్తున్న సంగతి ఏమిటంటే జగన్ చర్యల వల్ల కావచ్చు, పలు ఈక్వేషన్ల కావచ్చు, అగ్రవర్ణాలు చాలా వాటిని దూరం చేసుకున్నారని స్పష్టం అవుతోంది. ఎంత శాతం ఓట్లు వుంటాయి. ఎన్ని నియోజకవర్గాలు ప్రభావితం అవుతాయి అనేది పక్కన పెడితే, ఇలా కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం వల్ల, వాటి ఓట్ల కన్నా వాటి ప్రచారం ఎక్కువ హాని చేసింది.
ప్రధానంగా కమ్మ వర్గాన్ని జగన్ పూర్తిగా దూరం చేసుకున్నారు. ఎంత దూరం చేసుకున్నారు అంటే ఆయన వెనుక వున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి లాంటి నాయకుల ఇళ్లలో ఓట్లు కూడా వైకాపాకు పడి వుంటాయా? అంటే సందేహమే. ప్రపంచ వ్యాప్తంగా వున్న కమ్మ సామాజిక వర్గం అంతా ఒక్కటిగా మారింది. రామోజీ మీద కేసు, చంద్రబాబు అరెస్ట్ ఇవన్నీ మరింత ప్రేరేపించాయి. కమ్మవారు ఎవరికి వారు వారి వారి పరిథి మేరకు ప్రభుత్వం మీద ఎంతలా విరుచుకు పడాలో అంతా పడ్డారు. మెయిన్ స్ట్రిమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. కమ్మవారంతా జగన్ కు ఎంత డ్యామేజ్ చేయాలో, ఎంత చేయించగలరో అంతా జరిగింది.
రఘురామకృష్ణం రాజు ఉదంతంతో క్షత్రియులు దూరం అయ్యారు. అశోక్ గజపతి, సింహాచలం దేవస్థానం ఉదంతం మరింత దూరం చేసింది. దీన్ని ఆసరాగా తెలుగుదేశం క్షత్రియులకు చెప్పుకోదగ్గ సీట్లు కేటాయంచింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో క్షత్రియులంతా సాలిడ్ గా తెలుగుదేశం కూటమి వెనుక నిలబడ్డారు.
బ్రాహ్మణులు, వైశ్యుల విషయంలో జగన్ ఏ అన్యాయం చేయలేదు కానీ, భాజపా కారణంగా వారు కూటమి వైపు మొగ్గారు. క్రిస్టియన్ అనే ప్రచారం, కొన్ని చోట్ల హిందూ విగ్రహాలపై దాడులు అన్నీ కలిసి జగన్ ఖాతాను ఎంత తగ్గించాలో అంతా తగ్గించాయి.
రెడ్లు కూడా జగన్ తో సంతృప్తిగా లేరు. అధికారులు, కొంతమంది నాయకులకు పదవులు అందాయి. కానీ అలా అని చెప్పి, రెడ్లకు ఏమంతా అవకాశాలు కుప్పలుగా రాలేదు. జగన్ చుట్టూ వున్న కొంత మంది రెడ్లు మాత్రమే లాభపడ్డారు. తొలిసారి పల్నాడు ప్రాంతంలో సైతం రెడ్లు తమ పార్టీని కాదని కూటమికి ఓట్లు వేసారు.
కాపుల సంగతి తెలిసిందే. జనసేనను తమ పార్టీగా పూర్తిగా లెక్కలోకి తీసుకున్నారు. పవన్ ను తమ నాయకుడిగా గుర్తించారు. అందువల్ల 90శాతం కాపుల ఓట్లు కూటమికే వెళ్లాయి. ఓట్ల బదిలీ జరగదని ఆశలు పెట్టుకున్నారు వైకాపా నాయకులు. కానీ నూటికి నూరుశాతం ఓట్ల బదిలీ జరిగింది.
ఇక మిగిలింది బిసి లు, ఎస్ సి, ఎస్టీ, మైనారిటీలు. వీళ్ల ఓట్లు యాభై నుంచి 70 శాతం జగన్ గు వచ్చాయి. అయితే కూటమి కలివిడిగా పోటీ చేయడంతో ఫలితం లేకపోయింది.
కూటమి నేత చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారు. కమ్మ ఓట్లు ఎలాగూ వస్తాయని తెలుసు. కాపు ఓట్ల కోసం పవన్ ను ఎంత బుజ్జగించాలో, ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత వాడుకోవాలో అంతా చేసారు. అలాగే మిగిలిన వర్ణాలను, వర్గాలను చాలా పద్దతిగా లెక్కలు కట్టి మరీ దగ్గరకు వచ్చేలా చూసుకున్నారు.
ఫలితం… తెలిసిందే.