ఇప్పటికిప్పుడే ఆంధ్రకు స్పెషల్ స్టేటస్… అయిదేళ్ల పాటు కొన్ని వేల కోట్ల ఆర్థిక సహాయం, అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం బాధ్యతలు కేంద్రం తీసుకుంటుంది. ఇలాంటి హామీ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ప్రకటిస్తే చంద్రబాబు, పవన్ ల పరిస్థితి ఏమిటి? ఇంతకన్నా స్టేట్ కు కావాల్సింది ఏముంటుంది? భాజపా ఎలాగూ స్పెషల్ స్టేటస్ ఇవ్వదు. కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ హామీని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
భాజపా ఎంత ఇచ్చినా మంత్రి పదవులు, మహా అయితే అప్పు తెచ్చుకోవడానికి అనుమతులు తప్ప మరేమీ ఇవ్వదు. నిధులు విదల్చదు. ఇది గత పదేళ్లుగా అనుభవానికి వచ్చినదే. అందువల్ల ఇప్పుడు సరైన సమయం, బేరమాడే అవకాశం రెండూ రాష్ట్రం ముంగిటకు వచ్చాయి. దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం వుంది. కానీ అదే సమయంలో భాజపాతో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లినందున, దాన్ని మీరే అవకాశం వుండదు.
కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్లను భాజపా ముందు వుంచడానికి అవకాశం అయితే వుంది. 23 మంది ఎంపీలు వున్నా కేంద్రం మెడలు వంచలేకపోయారు. దానికి కారణం జగన్ కు వున్న కేసుల భయం. కానీ చంద్రబాబు కు అవేమీ లేవు కదా. అందువల్ల తమ పార్టీ మద్దతు కావాలి అంటే స్పెషల్ స్టేటస్ అడగాల్సిందే. మళ్లీ మళ్లీ ఇలాంటి అద్భుతమైన తరుణం ఇక ముందు వస్తుందన్న నమ్మకం లేదు.
అందుకు బేరం చూపించడానికి కాంగ్రెస్ రెడీగా వుండనే వుంది. స్పీకర్ పదవి, మంత్రి పదవులు తీసుకోవడం కన్నా ఇలా బేరం సాగించడం బెటరేమో? కూటమి నేతలు ఆలోచించాల్సిన తరుణం ఇది.