ఒక్క గెలుపుతో ఏపీలో రాజకీయ పరిస్థితులే కాదు, నందమూరి కుటుంబంలో కూడా పరిస్థితులు మారినట్టు కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ వరసలు కలిపి సంభోదించడం చాలామందిని ఆకర్షించింది. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా స్పందించిన తారక్, చంద్రబాబును మామయ్యా అని పిలవడం చాలామందికి ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా అనిపిస్తోంది.
టీడీపీ నిన్న గెలిస్తే, ఎన్టీఆర్ ఈరోజు పోస్ట్ పెట్టారు. చంద్రబాబు మామయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచాడు. లోకేష్, బాలకృష్ణకు కూడా పేరుపేరున శుభాకాంక్షలు తెలిపాడు.
“ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్ కి, పురందీశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు.”
ఇలా తన కుటుంబ సభ్యుల్ని వరసలు పెట్టి పలకరిస్తూ, వాళ్లకు శుభాకాంక్షలు తెలిపాడు తారక్. టీడీపీ గెలుపుపై ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మెల్లమెల్లగా చర్చ ఊపందుకుంది. అంతలోనే ట్వీట్ వేసి తనపై మొదలైన చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడు తారక్. అన్నట్టు పవన్ కల్యాణ్ కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు.
సందర్బం వచ్చిన ప్రతిసారి నందమూరి కుటుంబంతో కలవడానికే ప్రయత్నించాడు ఎన్టీఆర్. ఈసారి కూడా అతడు అదే పని చేశాడు. మరి గెలిచిన వాళ్లు ఎన్టీఆర్ ట్వీట్ కు కనీసం రిప్లయ్ అయినా ఇస్తారా?