ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారబోతోంది. మరి థియేట్రికల్ వ్యవస్థలో ఎలాంటి మార్పుచేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీని కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ నెలాఖరుకు కల్కి సినిమా వస్తోంది. ఆ సినిమా రిలీజ్ కోసం నిర్మాత అశ్వనీదత్ కచ్చితంగా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు. టికెట్ రేట్ల పెంపును కోరుతారు.
ఎలాగూ ఆయన టీడీపీ మద్దతుదారుడే కాబట్టి, ఆయనకు అనుకూలంగానే జీవో వస్తుంది. అయితే ఇక్కడ మేటర్ కల్కి గురించి మాత్రమే కాదు. కల్కి సినిమాకు ప్రభుత్వం ఇచ్చే జీవో రాబోయే రోజుల్లో చాలా సినిమాలకు కొలమానంగా మారుతుంది. అందుకే ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో, వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్ల శ్లాబుల్లో భారీగా మార్పులు చేసింది ఇక సినిమా బడ్జెట్ బట్టి, రిలీజైన మొదటి వారం లేదా 10 రోజుల్లో నామమాత్రంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ వస్తోంది.
ఇప్పుడు చంద్రబాబు రాకతో ఈ రూల్స్ అన్నీ మారడం ఖాయం. కల్కి సినిమాతోనే ఆ మార్పులు మొదలుకాబోతున్నాయి. నిర్మాత అశ్వనీదత్ సరైన రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలుపుదీరిన వెంటనే వెళ్లి పెద్దల్ని కలుస్తారు. కొత్త జీవో వచ్చిన వెంటనే మేకర్స్ అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపునకు ప్రత్యేక అనుమతులు పొందిన చివరి చిత్రం గుంటూరుకారం. ఈ సినిమాకు రిలీజైన రోజు నుంచి 10 రోజుల పాటు టికెట్ పై 50 రూపాయల వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. అంతకంటే ముందు రిలీజైన సలార్ సినిమాకు టికెట్ పై 40 రూపాయల పెంపు ఇచ్చింది.
అయితే ఇలా పెంచినప్పటికీ తమకు గిట్టుబాటు కాదనేది చాలామంది నిర్మాతల వాదన. ఎందుకంటే, ఏపీలోని సెమీ-అర్బన్ థియేటర్లలో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక పంచాయతీ పరిథిలో ఉన్న థియేటర్లలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయనేది వీళ్ల వాదన. ఇలాంటి రేట్లపై 40-50 రూపాయలు పెంచినా పెద్దగా ఒరిగేదేం లేదనే పెదవి విరుపులున్నాయి. వీటన్నింటినీ టీడీపీ సర్కారు పరిగణనలోకి తీసుకొని టికెట్ రేట్లు నిర్ణయించబోతోంది.
ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ రేట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. దీని కంటే ముందు చక్కదిద్దాల్సిన పనులు ప్రభుత్వానికి చాలా ఉన్నాయి. కాబట్టి కల్కి వరకు టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సదరు మంత్రిత్వ శాఖతో చర్చించి, రాష్ట్రంలో టికెట్ రేట్ల శ్లాబులపై ఓ నిర్ణయం తీసుకుంటారు.
నిజానికి అశ్వనీదత్ తలుచుకుంటే తన లాబీయింగ్ ఉపయోగించి కల్కి సినిమా టికెట్ రేట్లను ఎంతయినా పెంచుకోవచ్చు. కానీ అలా చేయకపోవచ్చు. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ వ్యవస్థ ఎంత ఘోరంగా తయారైందో ఆ సీనియర్ ప్రొడ్యూసర్ కు తెలియంది కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కల్కి సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచితే మొదటికే మోసం వస్తుంది.