పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నాయకురాలు వంగా గీతాపై పవన్‌కల్యాణ్ 70,354 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో జనసేన శ్రేణులు భారీగా సంబరాలు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కల్యాణ్, ఈ సారి ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టాలని సీరియస్‌గా పని చేశారు. చివరికి తాను అనుకున్నదే సాధించారు.
గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగడం వల్లే ఓటమి మూటకట్టుకున్నట్టు పవన్ గుర్తించారు. అందుకే ఈ దఫా ఆ తప్పు చేయకూడదని ఆయన అనుకున్నారు. టీడీపీతో జనసేన పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని ఒక బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి ఓటమి తప్పదని ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నారు.
టీడీపీ, జనసేన కలిస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని వైసీపీ ముందే పసిగట్టింది. అయితే పవన్‌కల్యాణ్‌ను విపరీతంగా టార్గెట్ చేయడం ద్వారా ఆయన సామాజిక వర్గానికి వైసీపీ శత్రువైంది. అదే ఈ ఎన్నికల్లో భారీ ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్‌కల్యాణ్‌తో పాటు ఆయన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా దాదాపు గెలుపొందడం విశేషం.
21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు తక్కువే అయినప్పటికీ, అన్నింటిలో గెలవడమే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు పని చేశాయి. అందుకే జనసేన మంచి ఫలితాల్ని సాధించిందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో వైసీపీ కంటే జనసేన ఎమ్మెల్యేలే ఎక్కువ వుండడం గమనార్హం.