‘చిరంజీవి తమ్ముడు’ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు!

పవన్ కల్యాణ్ కు ఏదీ సులభంగా అందలేదు. సినిమాల్లోకి రావడం ఈజీగా జరిగింది కానీ పవర్ స్టార్ గా మారడానికి బోలెడంత టైమ్ పట్టింది. అదే విధంగా రాజకీయాల్లోకి కూడా ఈజీగానే వచ్చారు కానీ…

పవన్ కల్యాణ్ కు ఏదీ సులభంగా అందలేదు. సినిమాల్లోకి రావడం ఈజీగా జరిగింది కానీ పవర్ స్టార్ గా మారడానికి బోలెడంత టైమ్ పట్టింది. అదే విధంగా రాజకీయాల్లోకి కూడా ఈజీగానే వచ్చారు కానీ నిలదొక్కుకోవడానికి దశాబ్దానికి పైగా పట్టింది. అటు సినిమాల్లోనైనా, ఇటు రాజకీయాల్లోనైనా పోరాటమే అతడ్ని నిలబెట్టింది.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిరంజీవి తమ్ముడొచ్చాడని అన్నారు చాలామంది. ఆ ఇమేజ్ ను కెరీర్ ప్రారంభంలో పవన్ కూడా ఎంజాయ్ చేశాడు. కానీ ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన పడిన శ్రమ వర్ణనాతీతం.

కెరీర్ స్టార్టింగ్ లో గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నప్పటికీ పవన్ ఆశించిన స్టార్ డమ్ మాత్రం రాలేదు. అప్పటికీ ఆయన చిరంజీవి తమ్ముడే. ఎప్పుడైతే ఖుషీ సినిమా బ్లాక్ బస్టర్ అయిందో, అందులో పవన్ నటన యూత్ కు విపరీతంగా ఎక్కేసిందో, అప్పట్నుంచి సొంత ఐడెంటిటీ క్రియేట్ అయింది.

ఆ తర్వాత కూడా పవన్ కు పోరాటం తప్పలేదు. వరుస ఫ్లాపులు చూశాడు. జల్సాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు, గబ్బర్ సింగ్ తో వేవ్ క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిందో, అప్పట్నుంచి ఫ్యాన్స్ లో ‘పవనిజం’ మొదలైంది.

హీరో ఇమేజ్ ను దాటిపోయాడు పవన్. అదే ఊపులో పార్టీ పెట్టారు. అక్కడ్నుంచి కూడా ఆయన ప్రయాణం ఒడిదుడుకులతోనే సాగింది. తనకున్న అశేష అభిమానగణంతో పార్టీ పేరు, జెండా, ఎజెండా ను ఘనంగా ప్రకటించారు పవన్ కల్యాణ్.

అయితే జనసేన ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీలా ఉవ్వెత్తున మొదలవ్వలేదు. ఇంకా చెప్పాలంటే జీరోతో స్టార్ట్ అయింది. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో పవన్ కనీసం పోటీ చేయలేదు. చంద్రబాబు-మోదీకి మద్దతివ్వడానికే పరిమితమయ్యారు.

ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పటికీ, జగన్ హవా ముందు నిలబడలేకపోయారు. పోటీచేసిన 2 చోట్ల ఓడిపోయారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే వైసీపీతో కలిసిపోయారు. ఇలా పరాభవాలు, అవమానాలు ఎదుర్కొంటూనే రాజకీయ ప్రస్థానం కొనసాగించిన పవన్ కల్యాణ్, ఎట్టకేలకు ఓ పొజిషన్ కు చేరుకున్నారు.

పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కల్యాణ్, రాజకీయంగా తను నిలబడ్డంతో పాటు, జనసేన పార్టీని కూడా నిలబెట్టారు. 2014, మార్చి 14న పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యేగా గెలవడానికి పదేళ్లు పట్టింది.

సినిమాల్లో ఎలాగైతే ‘చిరంజీవి తమ్ముడు’ అనే ఇమేజ్ నుంచి బయటపడి పవర్ స్టార్ అనిపించుకున్నారో.. రాజకీయాల్లో కూడా ఓనమాలు స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు.