ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ప్రజలలో ఉండే ఆశ కీలకపాత్ర పోషిస్తుందా? లేక వారిలో ఉండగల కృతజ్ఞతా భావం కీలక పాత్ర పోషిస్తుందా? అనే చర్చ కొన్ని వారాల కిందట మొదలైంది. ఈ మీమాంసపై గ్రేట్ ఆంధ్ర ఒక సవివరమైన కవర్ స్టోరీ కథనాన్ని కూడా అందించింది. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడే సరికి తెలుగుదేశం కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది.
సంక్షేమం పేరుతో గతంలో ఎన్నడూ లేని అనేక పథకాలు తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు. ఎందుకిలా జరిగింది అనే విశ్లేషణ దృష్టితో చూసినప్పుడు.. ప్రజలను విశ్వాసం, కృతజ్ఞత కంటే ఎక్కువగా.. ఆశ మాత్రమే ముందుకు నడిపిస్తుందని.. అలాంటి ఆశతోనే వారు ఓట్లు వేశారని అర్థమవుతోంది.
ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించడానికి నిజాలు మాట్లాడడం కంటే.. వారిని ఆకట్టుకునే మాటలు మాత్రమే చెప్పాలనే ప్రాథమిక సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరిచిపోయారు. ఒకవైపు తన రాజకీయ ప్రత్యర్ధులు అలవిమాలిన హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెడుతూ ఉండగా.. జగన్ మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి వాస్తవాలు మాట్లాడుతూ.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అన్నిటిని యధావిధిగా కొనసాగిస్తానని, వెసులుబాటును బట్టి పరిమితంగా కొత్త పథకాలు తీసుకువస్తానని మాత్రమే చెప్పారు.
ప్రజలను మోసం చేయడానికి ఆయన ప్రయత్నించలేదు. మీ ఇంటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు లబ్ధి అంది ఉంటే మాత్రమే ఓటు వేయండి.. లేకపోతే ఓటు వేయొద్దు అని అడిగిన నాయకుడు బహుశా దేశంలో మరొకరు ఉండరు. కానీ, చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలకు పెద్దపెద్ద తాయిలాలు ప్రకటించి వారిలో ఆశ పుట్టించడాన్నే ప్రధానంగా భావించారు.
పెన్షన్ 4000 చేయడం ఒక ఉదాహరణగా తీసుకుంటే.. అలాంటి హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారు అని ఇప్పుడు అర్థమవుతోంది. ‘చంద్రబాబు ఇలాంటివి ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు’ అనే ఒకే ఒక్క మార్గాన్ని జగన్ మోహన్ రెడ్డి అనుసరించారు. 2014 నాటి చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి సభలోను చూపిస్తూ.. దానిని అమలు చేయకుండా మోసం చేశారని.. అందుకే చంద్రబాబును ప్రజలు నమ్మరని జగన్ భావించారు.
కానీ ప్రజలలో పుట్టిన ఆశలే పనిచేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తమకు పెన్షన్ 4000 వస్తుంది.. ఒకవేళ ఆయన ఓడిపోయినా సరే ఇప్పుడు వస్తున్న 3000 ను కోల్పోయేదేమీ లేదు కదా..అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కే వేయడం మంచిది కదా.. అనే ఆలోచనకు ప్రజలు వచ్చారేమో అనిపిస్తోంది. వృద్ధాప్య, వితంతు పెన్షన్ అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అదే విధంగా ప్రతి సంక్షేమ పథకానికి.. వేలంపాట లాగా చంద్రబాబు నాయుడు కొంత మొత్తం పెంచి ప్రజలకు చూపెట్టిన ఆశ వారిని ప్రభావితం చేసింది. ఆ ఆశకు లోబడి పెద్ద స్థాయిలో ప్రజలందరూ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినట్లుగా కనిపిస్తోంది.
ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొని, లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తే మంచిదే. అధికారం దక్కిన తర్వాత మడత పేచీలు పెడితేనే ప్రజలు ఆగ్రహిస్తారు!