తమ్ముడి విజయంతో అన్నయ్యలో ఆనందం మేఘాల్ని తాకుతోంది. తొలిసారి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గడంతో, చిరంజీవి ఆనందానికి అవధుల్లేవ్. తన సంతోషాన్ని బయటపెట్టిన చిరు, పవన్ ను గేమ్ ఛేంజర్ గా, మేన్ ఆఫ్ ది మ్యాచ్ గా కొనియాడారు.
“ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నువ్వు, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ ఛేంజర్ వి మాత్రమే కాదు, మేన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు.”
అటు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా పవన్ కల్యాణ్ ను కంగ్రాట్స్ చెప్పాడు. ఎన్నికలకు ముందు పవన్ కు మద్దతుగా ట్వీట్ వేసిన బన్నీ, పవన్ అనుకున్నది సాధించినందుకు అభినందనలు తెలిపాడు. ఎప్పుడూ పవన్ వైపు ఉండే సాయిధరమ్ తేజ్ కూడా తన మామయ్యకు శుభాకాంక్షలు తెలిపాడు. పవన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, టాలీవుడ్ ప్రముఖులు, పరిశ్రమకు చెందిన కొన్ని సంస్థలు పవన్ కు శుభాకాంక్షలు చెప్పాయి.