కోట్ల మంది ప్రేమ ఏమైంది.. జగన్ నిర్వేదం

ఊహించని విధంగా ఎన్నికలు ఫలితాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి షాక్ కు గురయ్యారు. వై నాట్ 175 అనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన జగన్ కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ప్రజా తీర్పును…

ఊహించని విధంగా ఎన్నికలు ఫలితాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి షాక్ కు గురయ్యారు. వై నాట్ 175 అనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన జగన్ కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ప్రజా తీర్పును శిరసావహిస్తూనే, ఏం జరిగిందో దేవుడికే తెలియాలని.. తను చేయగలిగింది ఇంకేం లేదంటూ నిర్వేదంగా మాట్లాడారు. కోట్లాది మంది ప్రేమ ఏమైపోయిందో అర్థం కావడం లేదన్నారు.

“ఫలితాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. కనీసం ఊహించలేకపోయాను. అమ్మ ఒడితో 53 లక్షల మందికి మంచి చేశాం. ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా మంచి చేశాం. పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో పాటు, వాళ్ల ఇంటికే పెన్షన్ ఇచ్చే వ్యవస్థ తెచ్చాం. ఆ ఓట్లు  ఏమయ్యాయో కూడా తెలీదు. కోటి మందికి పైగా పొదుపు సంఘాలకు మంచి చేశాం. ఆ కోటిమంది ప్రేమాభిమానుల ఏమయ్యాయో తెలీదు. 26 లక్షల మంది చేయూత అందుకున్నారు, వాళ్ల ఆప్యాయత ఏమైందో తెలీదు. 54 లక్షల మందికి రైతు భరోసా కింది పెట్టుబడి సహాయం చేశాం. ఆ రైతన్నల ఓట్లు ఏమయ్యాయో తెలీదు.”

వీళ్లు మాత్రమే కాకుండా.. ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఎంతో మంచి చేశామని, వాళ్ల ప్రేమ ఎక్కడా ఫలితాల్లో కనిపించలేదని బాధపడ్డారు జగన్. మేనిఫెస్టోలో చెప్పింది 99శాతం అమలు చేయడమే తప్పా అని ప్రశ్నించిన జగన్.. ఎన్ని మంచి పనులు చేసినా ఆ ఆప్యాయత ఏమైందో తెలియడం లేదన్నారు.

ఇంకా ఎంతో మంచి చేయాలనుకున్నానని, కానీ ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారని అన్నారు జగన్. తనకు ప్రతిపక్షం కొత్త కాదని, పోరాటాలు అంతకంటే కొత్త కాదని, మరింత గుండె ధైర్యంతో మళ్లీ లేస్తామని ప్రకటించారు.