బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించి, ఆ వెంటనే కోర్టులో హాజరు పరిచారు. కోర్టు హేమకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది.
ఈ కేసుకు సంబంధించి ఎవ్వర్నీ ప్రలోభ పెట్టడానికి లేదా కేసును పక్కదోవ పట్టించడానికి ఆస్కారం లేకుండా చేసేందుకు హేమకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఇప్పుడామెను విచారణ నిమిత్తం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు.
దీనికి సంబంధించి హేమను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు, కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు పురోగతికి హేమను ప్రశ్నించడం అత్యవసరమని పోలీసులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ రేవ్ పార్టీలో హేమ పాల్గొనడమే కాకుండా, పార్టీని ఆమె కో-స్పాన్సర్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
వాదనల సందర్భంగా తను ఏ తప్పు చేయలేదని హేమ వాదించారు. పోలీసులు చెబుతున్నట్టు తను ఆ పార్టీకి హాజరైన మాట నిజమేనని ఆమె అంగీకరించారు. అయితే కేక్ కటింగ్ వరకు మాత్రమే తను ఉన్నానని, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయానని ఆమె కోర్టుకు తెలిపారు.
హైదరాబాద్ కు వెళ్లిన తర్వాత ‘బిర్యానీ చేయడం ఎలా’ అనే వీడియోను కూడా తను పోస్ట్ చేశానని ఆమె సాక్ష్యాలు చూపించారు. తను నిర్దోషినని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు, ఆమెకు 2 వారాల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. పోలీసుల వాదనలతో కోర్టు మరోసారి ఏకీభవిస్తే, హేమను కనీసం 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశం ఉంది.