వేణు స్వామిని ఓ సెక్షన్ తోపు, తురుము అంటూ ప్రమోట్ చేసింది. అతడి చుట్టూ వందల వీడియోలు తయారుచేసి వదిలింది. ఆయన కూడా తను చెప్పిందే వేదం అన్నట్టుగా అందరి జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా వేణుస్వామి విశ్లేషణలిచ్చాడు. జగన్ మరోసారి సీఎం అవుతారని, చంద్రబాబుకు రాజయోగం లేదని ఏవేవో చెప్పుకొచ్చాడు. కానీ ఈరోజు వస్తున్న ఎన్నికల ఫలితాలతో వేణుస్వామి రంగు బయటపడింది.
తన జ్యోతిష్యాలు ఫెయిల్ అవ్వడంతో వేణుస్వామి బహిరంగ ప్రకటన చేశాడు. ఇకపై పబ్లిక్ వేదికలపై ఎవ్వరి జాతకాల గురించి మాట్లాడనని ఆయన ప్రకటించాడు.
“నా జోస్యాన్ని, నన్ను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు నేను చెప్పిన జోస్యం తప్పయింది. జగన్ పై నేను చెప్పిన జోస్యం తప్పు అవ్వడం వల్ల నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు నుంచి రాజకీయ పరమైన జోస్యాలు, సినీ ప్రముఖుల వ్యక్తిగత జ్యోతిష్యాలు చెప్పడం మానేస్తున్నాను. జగన్, చంద్రబాబు జాతకాల్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి, ఇకపై బహిరంగ వేదికల్లో ఏ ప్రముఖుడి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషించను.”
తనకున్న పరిజ్ఞానం, విద్య ఆధారంగా జాతకాలు చెప్పానని, ఆంధ్రప్రదేశ్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యానని వేణుస్వామి అంగీకరించాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని వేణుస్వామి చెప్పారు. ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా ఆయన చెప్పారు. కానీ అవేవీ జరగలేదు, అప్పట్నుంచి ఆయనపై ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి దిశగా నడుస్తున్న వేళ, వేణుస్వామిపై మరోసారి తీవ్రస్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో, ఇకపై జాతకాలు చెప్పనని ఆయన ప్రకటించారు.