చంద్రబాబు నాయుడు తన జేబులో గోబెల్స్ ఫోటో పెట్టుకుని మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ స్ఫూర్తి పొందుతూ, అనునిత్యం ఆయనకు దండం పెట్టుకుంటూ రాజకీయాలు చేస్తుంటారో ఏమో మనకు తెలియదు. కానీ బాబుగారి మార్గదర్శకత్వంలో పార్టీ వేసే ప్రతి అడుగు కూడా గోబెల్స్ తరహాలో కుట్రపూరితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
కౌంటింగ్ నాడు కూడా ఈ గోబెల్స్ తరహా ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలని చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్టున్నారు. తమ ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు చేసి గెలిచిందని ప్రజల ఎదుట టముకు వేయడానికి ఒక అబద్ధపు ప్రచారం కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ముఠాలను సిద్ధం చేసి డీజీపి కార్యాలయం, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అందుబాటులోనే మకాం వేయించినట్లుగా తెలుస్తూ ఉంది.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ధోరణిని జాగ్రత్తగా గమనిస్తే మనకు ఓ సంగతి బోధపడుతుంది. ప్రచారంలో ఉన్న నాయకులు తమంత తాము దూసుకుపోతూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉండగా, పార్టీలో సీనియర్ నాయకులు ఒక దళంగా.. కేవలం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడమే తమ దైనందిన కార్యక్రమంగా మార్చుకున్నారు.
ప్రచార బృందాలతో కలవకుండా పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేయడం మీద మాత్రమే దృష్టి పెట్టిన నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు అసలు ప్రచారం మొహం కూడా చూడకుండా కేవలం ఎన్నికల సంఘానికి ప్రతిరోజు పితూరీలు చేయడం మీద మాత్రమే పనిచేశారు.
ఎన్నికల కోడ్ కు సంబంధించిన వ్యవహారం గనుక ఈసీ, ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటూ వచ్చింది. ఆ కారణంగానే ప్రధాని మోడీ భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జట్టు కట్టడం వలన ఆ పార్టీల విజ్ఞప్తులకు మాత్రమే పాజిటివ్‌గా స్పందిస్తూ వచ్చారని ఆరోపణలను సీఈవో మూట కట్టుకున్నారు.
ఇప్పుడు మళ్లీ అదే వ్యూహాన్ని తెలుగుదేశం రిపీట్ చేస్తున్నది. కేవలం ఎన్నికల ప్రధాన అధికారితో మాత్రమే సరిపెట్టకుండా ఈసీకి, డీజీపీకి కూడా పదేపదే ఫిర్యాదులు చేయాలని వారు ముందుగానే డిసైడ్ అయిపోయారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తున్నదని మొదటి గంట నుంచి కూడా ఫిర్యాదులు చేయాలని చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేసినట్టు తెలుస్తోంది.
కొన్ని గంటల తేడాతో ఫలితం తేలిపోతుంది. మంగళవారం మధ్యాహ్నానానికి ఒక అంచనా వచ్చేస్తుంది.. అయినా సరే.. ఈలోగా వీలైనంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ మీద బురద చల్లాలని తెదేపా దళాలు సిద్ధమవుతున్నాయి.