కౌంటింగ్ రోజున పదవులు వస్తాయి. గెలుపు కోసమే పోటీ. ప్రజలు వేసిన ఓట్లు లెక్క బాగుంటే లక్కు కలసి వస్తే పదవి దక్కుతుంది. అయితే కౌంటింగ్ మొదలవకుండానే చేతిలో ఉన్న పదవి ఎగిరిపోయింది. ఇది పార్టీ ఫిరాయించినందుకు బహుమతి అని అంటున్నారు. వైసీపీలో ఉంటూ ఎమ్మెల్సీ పదవిని మూడేళ్ళుగా అనుభవిస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన రఘు రాజు ఎన్నికల సమయంలో టీడీపీ వైపు ఫిరాయించారు.
దానిని ఆధారాలతో సహా వైసీపీ నేతలు శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేయడంతో ఆయన రెండు సార్లు రఘురాజుకు నోటీసులు జారీ చేసారు. ఆయన గైర్ హాజరు కావడంతో సీరియస్ యాక్షన్ నే మండలి చైర్మన్ తీసుకున్నారు.
దీంతో తెల్లవారితే కౌంటింగ్ అనగా రఘు రాజుకు పదవికి ఎసరు వచ్చింది. ఆయన మాజీ అయిపోయారు. ఎస్ కోటలో వైసీపీకి అలాగే విశాఖ ఎంపీ సీటులో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు ఆయనను అనర్హుడిగా చేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని మండలి చైర్మన్ తీసుకున్నారు.
ఎమ్మెల్యేగా చాన్స్ ఇవ్వలేమనే చాలా కాలం క్రితమే ఎమ్మెల్సీ పదవులను వైసీపీ అధినాయకత్వం కొంతమంది కీలక నేతలకు ఇచ్చింది అని పార్టీ నేతలు చెబుతున్నారు. వారు తిరిగి సార్వత్రిక ఎన్నికల వేళ టికెట్ కోసం ప్రయత్నించారు. అది తప్పు కాకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సింది పోయి కట్టు తప్పి ప్రత్యర్థికి ఉపకారం చేసేలా వ్యవహరించడంతోనే ఈ కఠిన నిర్ణయం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో ఎస్ కోటలో రెండు వర్గాలు ఇప్పటికే ఉన్నాయి.
రేపు టీడీపీ అధికారంలోకి వస్తే పోయిన ఎమ్మెల్సీ పదవి అయినా ఇస్తారో లేదో తెలియదు కానీ రఘురాజు మాత్రం మాజీ అయిపోయారు అని అంటున్నారు.