వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా పట్టు వుందని అందరూ ఒప్పుకునే మాట. అయితే ఈ దఫా కొన్ని పట్టణ సీట్లపై కూడా వైసీపీ ఆశలు పెట్టుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన సందర్భంలో పట్టణ ప్రాంతాల్లో చెప్పుకోతగిన సీట్లను వైసీపీ సాధించలేకపోయింది. ఉత్తరాంధ్రలోని విశాఖలో నాలుగుకు నాలుగు ఎమ్మెల్యే సీట్లను టీడీపీ సొంతం చేసుకుంది.
అయితే ఈ దఫా విశాఖ నగరంలో రెండు సీట్లకు తగ్గకుండా సొంతం చేసుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే విజయవాడ నగరంలో ఈస్ట్, వెస్ట్ స్థానాలను దక్కించుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గుంటూరులో కూడా రెండు సీట్లపై వైసీపీ ఆశలు పెంచుకుంది. అలాగే రాజమండ్రిలో కూడా పాగా వేసే అవకాశాలున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.
గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. గత ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్‌లో వైసీపీ, వెస్ట్‌లో టీడీపీ గెలుపొందాయి. కానీ ఈ ఎన్నికల్లో వెస్ట్‌లో వైసీపీ అభ్యర్థి విడదల రజనీ గట్టి పోటీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు గెలుపు అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా వైసీపీ సత్తా చాటుకుంటుందని ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే స్థానిక రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయని సమాచారం.
రేపు ఈ సమయానికి ఇలాంటి ప్రచారానికి ఫుల్స్టాప్ పడేలా ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు వెలువడుతూ వుంటుంది. ఏది ఏమైనా ప్రజాతీర్పు వచ్చే చివరి నిమిషం వరకూ రాజకీయ పార్టీలు అంచనాలు వేస్తూ కనిపిస్తున్నాయి.