మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను చూసిన సుప్రీంకోర్టు… సీరియస్‌గా స్పందించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి వెళ్లకుండా ఆంక్షలు విధించడం గమనార్హం. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి పాల్పడుతున్న సందర్భంలో అడ్డుకోడానికి టీడీపీ కార్యకర్త వెళ్లిన సంగతి తెలిసిందే. తనకు పిన్నెల్లి నుంచి ప్రాణహాని పొంచి వుందని, ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ అతను సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాచర్ల ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చింది. అయితే మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్న విషయాన్ని వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రిగ్గింగ్ సంగతిని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, అలాగే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. మరీ ముఖ్యంగా ఎస్పీ బిందు మాధవ్ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లిపై కక్షపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
రిగ్గింగ్‌ను అడ్డుకోడానికి వెళ్లిన పిన్నెల్లి… ఆవేశంలో ఈవీఎం ధ్వంసానికి పాల్పడినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ ట్రాప్‌లో పిన్నెల్లి చిక్కారు. ఈవీఎం ధ్వంసానికి దారి తీసిన పరిస్థితులను న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోలేదు. కంటికి కనిపించేదే నిజం. పిన్నెల్లి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా సమస్యను కోరి తెచ్చుకున్నారు. ఇప్పటికే మాచర్లకు వెళ్లొద్దని ఆదేశాలు ఇస్తూ, ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
అయితే పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రంలోకి అడుగు పెట్టనివ్వొద్దనే వ్యూహంలో భాగంగా ఈవీఎం ధ్వంసమైన పోలింగ్ బూత్‌లోని టీడీపీ ఏజెంట్‌తో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది. టీడీపీ పాచిక పారింది. పిన్నెల్లిని నరసారావుపేటలోని కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించడం చర్చనీయాంశమైంది. అలాగే ఈ నెల ఆరో తేదీలోపు పిన్నెల్లి కేసును పరిష్కరించాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆదేశాలిచ్చింది.