తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ సజావుగానే జరిగింది. కొందరు కొన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలకు కౌంటర్లు కూడా బాగానే పడ్డాయి. మొత్తమ్మీద అంతా సాఫీగానే సాగిపోయింది. ఇక రెండు నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంది. ఒకటి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, మరోటి అధికారిక చిహ్నంలో మార్పులు.
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు రేవంత్ ను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవొచ్చు. కానీ అధికారిక చిహ్నంలో మార్పులే పెద్ద గొడవకు దారితీసేలా ఉన్నాయి. కొందరు ప్రముఖులు కూడా ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని చెబుతున్నారు. అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ ను, కాకతీయ తోరణాన్ని తీసేయడం తెలివి తక్కువ పని అంటున్నారు. దీనిపై గులాబీ పార్టీ అధినేత అండ్ నాయకులు మొదటినుంచి మండిపడుతున్నారు.
కాకతీయ తోరణం తీసేయడానికి రేవంత్ చెబుతున్న కారణం ఏమిటి? కాతీయ రాజులు ఆదివాసీలైన సమ్మక్క సారలమ్మను చంపారని అంటున్నాడు. ఆ తోరణం రాజరికానికి చిహ్నం కాబట్టి ప్రజాస్వామ్య తెలంగాణలో అది ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. ఇక చార్మినార్ కూడా రాచరికపు చిహ్నమే కాబట్టి అది కూడా ఉండొద్దు అంటున్నాడు. వాటి స్థానంలో భారత ప్రభుత్వానికి చెందిన మూడు సింహాలు, తెలంగాణ అమరవీరుల స్థూపం పెడతానంటున్నాడు. అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి స్మారక స్థూపం ఉండటమే కరెక్టు అంటున్నాడు.
చార్మినార్, కాకతీయ తోరణం తీసేయడాన్ని గులాబీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణకు ఆ రెండూ గర్వ కారణం అంటోంది. వాటిని రాజరిక చిహ్నాలుగా చూడకూడదని వాదిస్తోంది. తెలంగాణ అనగానే ప్రత్యేకించి హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది చార్మినార్. కాకతీయ తోరణమైనా, చార్మినార్ అయినా గొప్ప కట్టడాలు అనడంలో సందేహం లేదు. రాజులు సాగించిన అరాచకాలు వేరు, వారు సృష్టించిన కళా సంపద వేరు. ఈ రెండింటిని ఒక గాటన కట్టకూడదు.
ఇక అధికారిక చిహ్నంలో రేవంత్ రెడ్డి చేయాలనుకుంటున్న మార్పులను బీజేపీ కూడా స్వాగతిస్తున్నప్పటికీ ఒక మెలిక పెడుతోంది. బీజేపీ ఈ మార్పులను మతం కోణంలో చూస్తోంది. చార్మినార్ ముస్లిం రాజు నిర్మించాడు కాబట్టి దాన్ని తీసేయాలంటోంది. కాకతీయులు హిందూ రాజులు కాబట్టి వారు కట్టిన తోరణం తీసేయకూడదని అంటోంది. రేవంత్ రెడ్డేమో మతాలూ వేరైనా ఇద్దరూ రాజులే, ఇద్దరిదీ రాజరికమే కాబట్టి చార్మినార్, తోరణం రెండూ అక్కరలేదని అంటున్నాడు.
మూడు పార్టీలు మూడు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి మొండిగా ముందుకెళ్ళడంలేదు. అసెంబ్లీలో అన్ని పార్టీలతో చర్చించాకనే దీనిపై నిర్ణయం తీసుకుందామంటున్నాడు. నిన్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో కూడా తామేమీ సర్వజ్ఞులం అనుకోవడంలేదని చెప్పాడు. ఆ సోయి ఉన్నందుకు సంతోషించాల్సిందే.