మోడీ 3.0 హ్యాట్రిక్‌కు ట్రైలర్ విడుదల!

ప్రధానిగా నరేంద్రమోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందనే అంచనాలు దేశమంతటా సాగుతున్నాయి. శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దాదాపుగా…

ప్రధానిగా నరేంద్రమోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందనే అంచనాలు దేశమంతటా సాగుతున్నాయి. శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని కన్ఫర్మ్ చేశాయి. కాకపోతే.. దేశంలో ఎన్నికల కౌంటింగ్ జరగడానికి రెండు రోజులు ముందుగానే.. మోడీ హ్యాట్రిక్ కు సంబంధించి ట్రైలర్ విడుదల అయింది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి నెగ్గడం ద్వారా హ్యాట్రిక్ కొట్టింది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరిగాయి. అన్నింటికీ కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగేలాగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ 19నే ఎన్నికలు జరిగాయి. మామూలుగా అయితే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా మంగళవారమే లెక్కింపు జరగాలి. అయితే.. ఆ రాష్ట్రాల్లో శాసనసభల కాలపరిమితి ఆదివారం ముగుస్తుండడంతో కౌంటింగ్ ను రెండు రోజులు ముందుకు జరిపారు.

ఆదివారం పూర్తయిన ఓట్ల లెక్కింపులో అరుణాచల్ ప్రదేశ్ లో భాజపా ఘన విజయం సాధించింది. గతంలో కంటె 5 సీట్లు అక్కడ ఎక్కువగా సాధించింది. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలుండగా, 10 ప్రారంభంలోనే ఏకగ్రీవం అయి బిజెపినేతలు గెలిచారు. ఎన్నికల్లో బిజెపి 36 సీట్లు గెలుచుకుంది. మొత్తం వారి బలం 46 అయింది. విపక్ష పార్టీల్లో ఎవరికి పదిశాతం సీట్లు, 6, కూడా దక్కలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదానే లేకుండాపోయింది. అరుణాచల్ ప్రదేశ్ లో భాజపా సాధించిన ఘనవిజయం.. మోడీ సాధించబోయే హ్యాట్రిక్ ఘనవిజయానికి ట్రైలర్ పార్ట్ మాత్రమేనని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అదే సమయంలో సిక్కింలో అధికారంలో ఉన్న పార్టీ ఎస్‌కేఎం మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. సిక్కింలో మొత్తం 32 సీట్లుండగా అధికారం దక్కడానికి 17 మంది గెలిస్తే చాలు. కానీ ఎస్‌కేఎం పార్టీ తరఫున ఏకంగా 31 మంది గెలిచారు. సిక్కింలో గతంలో అయిదుసార్లు అధికారంలోకి వచ్చిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒకే స్థానానికి పరిమితమైంది. అధికారంలో ఉన్న పార్టీలకే అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వడం గమనార్హం.