గొర్రెలకి గడ్డి, మనుషులకి డబ్బు. గొర్రెలకో కాపరి. మనుషులకో లీడర్. కాపరి అంతిమ లక్ష్యం కబేళా. లీడర్ కూడా అదే. కబేళాలో కోస్తారు, ప్రజాస్వామ్యంలో మేస్తారు. కోత, మేత, రోత, మోత, కూత ఇవన్నీ కలిస్తే జనం తలరాత.
ఐదేళ్లకోసారి ఓటు, దాని విలువ నోటు. అమ్మిన వాడికి అరిచే హక్కు లేదు. కొన్న వాడికి కరిచే హక్కు వుంటుంది. ఓటుకి రెండు వేలు. రోజుకి సరాసరి రూపాయి. ఐదేళ్లకి దేశం లీజుకి. రూపాయిని భిక్షగాడు కూడా తీసుకోడు. కానీ ఓటరు తీసుకుంటాడు. గొర్రెని కొన్నవాడికి అమ్మే హక్కు వుంటుంది. నరికేటప్పుడు మెడ నిమరడం నాయకుడి లక్షణం.
చేపకి స్నానం చేయిస్తానని వాగ్దానం చేయడమే రాజకీయం. గొర్రెలకి గొర్రెల్ని ఇవ్వడమే సంక్షేమం, తోడేలుకి శాంతి పతకం. చిరుత పులికి దయాళువు బిరుదు. చదరంగానికి చెద పట్టింది. గళ్లు కనపడడం లేదు. కళ్లు లేని వాడు రంగుల్ని వర్ణించడమే రాజకీయం.
గొర్రెల్ని ఇవ్వకుండా, పుచ్చుకోకుండా 700 కోట్లు తినేయడమే అన్నిటికంటే గొప్ప పథకం. మత్తు మందు మనమే ఇచ్చి, మేలుకొలుపు మనమే పాడితే అది కదా రాజకీయం, అదే కదా రాజకీయం.
కొత్త టర్మ్, లీజుదారులు పాత లేదా కొత్త. ఎవరొచ్చినా నాటకం ఒకటే. ముఖాలు మారుతాయి. డైలాగ్‌లు ఒకటే. పాదరక్షలు ఉచితమే. కానీ కుట్టింది నీ చర్మంతోనే. వ్యాపారస్తులకి దయ వుండదు. లాభనష్టాలే వుంటాయి.
మీడియాలో శీర్షికలు మారుతాయి. జనానికి ఎప్పటిలా శీర్షాసనమే. మనం తలకిందులై, ప్రపంచం తలకిందులుగా వుందని నమ్మడమే జ్ఞానం. డబ్బే సమస్త జ్ఞానం. డబ్బుంటే జ్ఞానాన్ని ఎక్కించే మోటివేటర్లు దొరుకుతారు. జ్ఞానం వల్ల డబ్బు దొరకదు. డబ్బుతో అధికారం. అధికారంతో అజ్ఞానం. అజ్ఞానంతో జీవితం సుఖవంతం. సమస్త వేదాంత సారం ఇదే.
వేదాంతం కంటే దంతం గొప్పది. తిన్నది అరక్కపోతే వేదాంతం. తిన్నది అరిగితే అది దంతం.
మన నాయకులు దార్శనికులు, వారసుల్ని అధికారంలోకి చూడగలిగే దార్శనికత. గొర్రెలకి ఉన్ని స్వెట్టర్లు పంచి, బర్రెలకి ఉచితంగా పాల పంపిణీ చేయడమే రాజకీయం. తెల్లారుతుంది. చీకటి పడుతుంది. మధ్యలో ఏమీ మారదు. పేదలు మరింత గానుగెద్దులు. ధనవంతులు మదపుటేనుగులు.
జనం వేరు, భజనం వేరు. సంగీతానికి ఆదరణ లేదన్నది ఎవర్రా?
రేపు చూడు, చిడతలు, డోళ్లు, సన్నాయిలు ఎలా మోగుతాయో, వాగుతాయో.
నాట్యకారులకి కొదువలేదు. మందు షాపులు బంద్. అన్నింటికి ముందస్తు వుంటుంది. ప్రతి గ్లాస్‌కి మెమరీ లాస్. ఎవడికీ వాడే డ్యాన్స్ మాస్టర్. ఒకటి పడితే కథక్. రెండు పడితే కథాకళి. మూడు దాటితే బ్రేక్ డ్యాన్స్. అంతకు మించితే సమాధి స్థితి. యోగులు తపస్సు చేస్తే కూడా పొందలేని స్థితి.
లిక్కర్ పడితే కిక్కర్, దాటితే కక్కర్. భ్రాంతి కంటే వాంతి బెటర్. వెలుగు రాదని తెలిస్తే చీకటినే ప్రేమించాలి. జగత్ నిష్ప్రయోజనం అయితే మత్తుని ధ్యానించాలి. అన్నీ చిత్తు, సత్తు.
ప్రజాస్వామ్యం అంటే గొర్రెల సంత. గొర్రెలకి బదులు తోడేళ్లు మే అని అరుస్తుంటాయి. మే అంటే మేత, మా అంటే మాకేంటి?
గ్రేట్ ఇండియా సర్కస్ ఉదయం ఆటతో. టికెట్ లేదు, ఉచితం. ప్రతి ప్రేక్షకుడు గాలిలో ఊయల ఊగాలి. కింద వల వుండదు. పడితే పూచీ నీదే. జోకర్లే కళాకారులుగా మారిపోయిన కాలంలో జీవిస్తున్నాం.
పులులు బతకాలంటే జింకలుండాలి. వేట వుంటేనే అడవి. కొన్ని బతకాలంటే కొన్ని పోవాలి. నువ్వు వేటగాడివో , వేటవో తేల్చుకో.
వేటగాళ్లని వేటాడే వాడే నాయకుడు.
జీఆర్ మహర్షి