ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద, పబ్లిసిటీ మీద బిజీగా వున్నారు దర్శకుడు శంకర్. మరోపక్కన గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేయాల్సి వుంది. వాస్తవానికి ఈ నెలలో ఓ షెడ్యూలు కూడా వుంది. అయితే గతంలో క్యాన్సిల్ అయినా అనేకానేక షెడ్యూళ్ల జాబితాలోకే ఇదీ చేరుతుందనే అనుమానాలు వుండనే వున్నాయి. ఈ లెక్కన ఆ సినిమా ఎప్పటికి పూర్తి అవుతుంది అన్నది అసలు సిసలు క్వశ్చను. పూర్తి కావడం మాట దేవుడెరుగు… అసలు ఈ ఏడాది విడుదల వుంటుందా? అన్నది ఇంకా పెద్ద ప్రశ్న.
జూన్ నెల అయిపోయినట్లే. జూలై నెల ఖాళీ లేనట్లే. ఆగస్టు నెల అడ్వాన్స్ బుకింగ్ లు అయిపోయినట్లే. ఇక మిగిలింది చివరి నాలుగు నెలలు. ఈ నాలుగు నెలల్లో రావాల్సిన భారీ సినిమాలు లేదా పెద్ద సినిమాలు చాలానే వున్నాయి. ఎన్టీఆర్ దేవర వీటిలో వుండనే వుంది. మీడియం సినిమాలు సంగతి సరే సరి. వీటన్నింటి నడుమ మంచి ఫెస్టివల్ డేట్ ను గేమ్ ఛేంజర్ కోసం పట్టుకోవాల్సి వుంటుంది.
ఇంతకీ అసలు గేమ్ ఛేంజర్ ఎప్పటికి పూర్తవుతుంది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం మరో ఇరవై నుంచి ముఫై వర్కింగ్ డేస్ షూటింగ్ వుందని తెలుస్తోంది. ఈ ముఫై రోజుల్లో హీరో రామ్ చరణ్ ఓ పది రోజులు వస్తే చాలు. వరుసగా డేట్ లు దొరికితే ఇదేమంత పెద్ద టాస్క్ కాదు. కానీ ఈ సినిమా ఆరంభం నుంచి సమస్య అదే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హీరో రామ్ చరణ్ నే తన పనుల వత్తిడి వల్లనో, మరెందు వల్లనో చాలా రోజులు షూట్ క్యాన్సిల్ చేసారని తెలుస్తోంది.
అభిమానులు, జనాలు అంతా డైరక్టర్ శంకర్ నే కారణం అనుకుని, అతన్ని తిడుతున్నారు. కానీ యూనిట్ పైకి ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకంటే అసలు సంగతి వేరు అని తెలుసు కనుక. అందువల్లే సినిమా ఎప్పటికి పూర్తి అవుతుంది. విడుదల ఎప్పుడు వుండొచ్చు అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. పోనీ ఆగస్ట్ నాటికి షూట్ వర్క్ పూర్తి అయిపోతుంది అనుకుంటే, పోస్ట్ ప్రొడక్షన్ మరో నెల వుండాల్సి వుంటుంది.
అంటే అక్టోబర్.. నవంబర్.. డిసెంబర్ నెలల్లో విడుదలకు చాన్స్ వుంటుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, కానీ ఇప్పటి వరకు ఈ సినిమా వర్క్ జరుగుతున్న తీరు చూస్తుంటే అలా అవుతుందా అన్నది అనుమానం.