ఏ హీరోయిన్ ఏ కేటగిరీలోకి..?

ఏ హీరోయిన్ ఎప్పుడు స్టార్ అయిపోతుందో చెప్పలేం. కానీ ఈమధ్యకాలంలో హీరోయిన్ల విషయంలో కూడా ఈ గ్రేడ్స్ వచ్చేశాయి.

ఓటీటీ సంస్థలన్నీ హీరోల్ని ఏ-ప్లస్, ఏ, బి-ప్లస్, బి.. ఇలా కేటగిరీలుగా విభజించుకొని, వాళ్ల సినిమాల్ని డీల్ చేస్తుంటాయి. అదే సోషల్ మీడియాకొచ్చేసరికి హీరోల్ని టయర్-1, టయర్-2, టయర్-3 కింద విభజిస్తూ ఉంటారు చాలామంది.

హీరోయిన్ల విషయంలో ఈ కేటగిరీలు చాలా తొందరగా మారిపోతుంటాయి. ఏ హీరోయిన్ ఎప్పుడు స్టార్ అయిపోతుందో చెప్పలేం. కానీ ఈమధ్యకాలంలో హీరోయిన్ల విషయంలో కూడా ఈ గ్రేడ్స్ వచ్చేశాయి. కొన్ని సినిమాలకు కొంతమంది హీరోయిన్లు అనే విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోంది.

ఉదాహరణకు ప్రియాంక చోప్రా, జాన్వి కపూర్, కియరా అద్వానీ, రష్మిక, దీపిక పదుకోన్ లాంటి హీరోయిన్లను తీసుకుంటే, వీళ్ల రేంజ్ వేరు. టాలీవుడ్ పెద్ద హీరోలు సినిమాలు చేయాలంటే ప్రస్తుతం వీళ్లు ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా హీరోయిన్లు అన్నమాట.

వీళ్ల తర్వాత కేటగిరీలోకి మీనాక్షి చౌదరి, శ్రీలీల, కీర్తిసురేష్, అనుపమ, సంయుక్త, మృణాల్ లాంటి తారలు వస్తారు. నిజానికి వీళ్లలో కొందరు వరుసగా హిట్స్ ఇస్తున్న తారలున్నారు. అయితే పైన చెప్పుకున్న కేటగిరీలోకి మాత్రం ఇంకా వెళ్లలేదు.

ఇక కేటగిరీ-3లో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాధ్, రాశీఖన్నా, నేహాశెట్టి లాంటి హీరోయిన్లను చెప్పుకోవచ్చు. వీళ్లు కూడా సక్సెస్ లు కొడతారు. కానీ ఓ పరిధి వరకే. కొంతమంది హీరోలకే వీళ్లు పరిమితమైపోయారు.

వీళ్లు కాకుండా.. నిధి అగర్వాల్, ప్రియాంక మోహన్, అమృతా అయ్యర్ లాంటి భామలు కూడా అప్పుడప్పుడు మెరుస్తుంటారు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే వీళ్లను పించ్ హిట్టర్స్ అనుకోవచ్చు. వీళ్లు ఇలా మెరిసి అలా మాయమౌతుంటారు.

సీజనల్ హీరోయిన్ల కేటగిరీ కూడా ఉంది. ఇందులో సమంత, శృతిహాసన్ లాంటి తారల్ని చెప్పుకోవచ్చు. వీళ్లు నటిస్తే క్రేజ్. కానీ ఎప్పుడు నటిస్తారో చెప్పలేం. అలా ఉంటుంది వీళ్ల కెరీర్.

ఇక అంతోఇంతో క్రేజ్ ఉన్నప్పటికీ అవకాశాలు రాని బ్యాచ్ ఒకటుంది. అందులో రకుల్, పూజాహెగ్డే, నభా నటేష్ లాంటి హీరోయిన్లను చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు మాత్రమే వీళ్లకు అవకాశాలు తలుపు తడుతుంటాయి.

ప్రస్తుతం రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్న హీరోయిన్లు వీళ్లే. వీళ్లు కాకుండా కొంతమంది అదృష్టవంతులు కూడా ఉంటారు. ఇమాన్వి, భాగ్యశ్రీ లాంటి తారల్ని ఇందులో చెప్పుకోవచ్చు. ఇక మిగతా హీరోయిన్లంతా ఏ కేటగిరీలోకి వస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

6 Replies to “ఏ హీరోయిన్ ఏ కేటగిరీలోకి..?”

Comments are closed.