కౌంటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ జిల్లా పోలీస్‌శాఖ భద్రతా పరమైన చర్యల్ని కట్టుదిట్టం చేసింది. వైఎస్సార్ జిల్లాలో గత నెల 13న జరిగిన ఎన్నికల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా, అంతా ప్రశాంతంగా సాగిపోయింది. జమ్మలమడుగులో మాత్రం వైసీపీ , కూటమి నేతల మధ్య మాటలు హద్దులు దాటి, భౌతికదాడుల వరకూ వెళ్లింది. దీంతో అక్కడి పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
పోలీస్ అధికారుల సూచన మేరకు సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌లో ఉన్నారు. అలాగే జమ్మలమడుగు , కడప ఎంపీ కూటమి అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి తమ స్వగ్రామం దేవగుడిలో ఇంటికే పరిమితం అయ్యారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ శ్రేణులు కొన్ని చోట్ల అల్లర్లకు పాల్పడే అవకాశం వుందని తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అంతా ప్రశాంతం. దీంతో వైఎస్సార్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఊపిరి తీసుకుంది.
ఈ నేపథ్యంలో కౌంటింగ్ అనంతరం ఎక్కడా గొడవలకు ఆస్కారం లేకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంతో అత్యవసరమైతే తప్ప, ఇంటి గడప దాటొద్దని ప్రజానీకానికి పోలీస్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. కౌంటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని జిల్లా అంతటా దాదాపు కర్ఫ్యూ వాతావరణం వుంటుందని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి అనవసరంగా బయటికొచ్చి, గొడవలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని పోలీసులు హెచ్చరించారు. అలాగే 21 మంది రౌడీషీటర్లపై జిల్లా బహిష్కరణ వేటు వేసినట్టు పోలీసులు వెల్లడించారు.