2024 ఎన్నికల ఫలితాల వెల్లడికి కేవలం ఒకే ఒక్క రాత్రి మిగిలి వుంది. ఈ ఫలితాల కోసం నెలల తరబడి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి అనుచరులు పని చేశారు. ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్‌కు ఇక 24 గంటల సమయం మాత్రమే వుంది. కౌంటింగ్ దగ్గర పడే కొద్ది నాయకుల్లో టెన్షన్ పెరుగుతోంది. అధికారంపై వైసీపీ, కూటమి …రెండూ ధీమాగా ఉన్నాయి. ఈవీఎంలలో ఏముందో అంతుచిక్కకపోవడంతో ఫలితాలపై నరాలు తెగేంత ఉత్కంఠ.
అధికారం దక్కించుకుంటే …ఐదేళ్ల పాటు భయం లేదు. లేదంటే తమ పరిస్థితి ఏంటనే ప్రశ్న నాయకుల మెదళ్లను తొలుస్తోంది. ఒకవేళ అధికారం దక్కకపోతే భవిష్యత్ ఎలా వుంటుందో అనే ఆలోచనే నాయకుల్ని వెంటాడుతోంది, వేధిస్తోంది. అధికారం రావడమే ఆలస్యం, ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలని టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అలాగే మరోసారి తమకే అధికారం దక్కుతుందని, ఈ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టిన నాయకులు, అధికారుల్ని విడిచి పెట్టొద్దని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇలా అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరి లెక్కల్లో వాళ్లు మునిగితేలుతున్నారు.
ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలపై ఇప్పటికీ పలు కోణాల్లో రాజకీయ నాయకులు లెక్కలేస్తున్నారు. వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్‌ను దగ్గర పెట్టుకుని, సాధ్యాసాధ్యాలపై బేరీజు వేసుకుంటున్నారు. ఇలా ప్రతిదానికీ.. ఈ ఒక్క రాత్రి ఎలాగోలా గడిస్తే చాలు అని మనసుకు సమాధానం చెప్పుకుంటున్నారు.
అధికారం వస్తే …చేసుకోవాల్సిన పనులపై కొందరు దృష్టి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకే నాల్గో తేదీ ఫలితాలు వెలువడ్డాక భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోడానికి రాజకీయ నాయకులు ప్రిపేర్ అవుతున్నారు. అభిమానించే పార్టీకి అధికారం రాకపోతుందా అనే ధీమా. మరోవైపు ఏమవుతుందో అనే భయం. ఈ దఫా ఎన్నికలు గందరగోళానికి తెరలేపాయి. ప్రజల నాడి అంతుచిక్కడం లేదని రాజకీయ నాయకులు, సెఫాలజిస్టులు అంటున్నారు. ఎవరెన్ని అంచనాలు కట్టినా… అంతిమంగా ఏదైనా జరగొచ్చనే కొసమెరుపు మాట తప్పనిసరిగా వుంటోంది.
కొన్ని నెలలుగా ఏపీలో అధికారం ఎవరిదనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే… ఒకే ఒక్క రాత్రి గడవాల్సి వుంది. అందుకే ఈ రాత్రి ఎంతో విలువైంది, భారమైంది కూడా. ఎందుకంటే….. రేపటి నుంచి కొందరికి నిద్రలేని రాత్రుల్ని మిగల్చనుంది కాబట్టి.