రాయలసీమలో ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించాయి. ఈ విషయాన్ని వాతావరణశాఖ వెల్లడించింది. నిన్నమొన్నటి వరకు వేసవి కారణంగా తీవ్రస్థాయిలో ఎండలున్నాయి. వీటికి తోడు రాజకీయ వేడి. దీంతో నాలుగైదు నెలలుగా ఆంధ్రప్రదేశ్ సమాజం వేడి మీద ఉన్నట్టే లెక్క.
ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిశాయి. మరో 24 గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు కానుంది. మొత్తానికి నాల్గో తేదీ రాత్రికల్లా ఎన్నికల తంతు పరిసమాప్తం కానుంది. కొత్త ప్రభుత్వం ఏదనేది తేలనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖలు తదితర హడావుడి మొదలు కానుంది. ఇదే సందర్భంలో వానాకాలం మొదలై, రైతుల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు.
పంటల సాగుపై దృష్టి సారిస్తారు. ఎన్నికల గొడవలు లేకపోవడానికి ఈ పరిస్థితి దోహదం చేస్తుంది. పల్లెల్లో వ్యవసాయ పనుల్లో రైతులు, కూలీలు మునిగితేలితే, రాజకీయాలు పక్కకు వెళ్లే అవకాశాలే ఎక్కువ. పైగా గతంలో మాదిరిగా ఇప్పుడు రాజకీయ గొడవలు తక్కువే అని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే, ఎవరి కోసమే మనమెందుకు కొట్టుకుని, జైలుపాలు కావాలనే చైతన్యం జనంలో పెరిగింది.
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చేయొచ్చు. అక్కడక్కడ చిల్లర బ్యాచ్‌కు పోలీసులు పరోక్షంగా మద్దతు ఇస్తుండడంతో అల్లర్లు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం వుంది. వాటికి కూడా చెక్ పెడితే సమాజం ప్రశాంతంగా వుంటుంది. రాజకీయ స్వార్థంతో ఎవరైనా గొడవలకు పాల్పడితే, వారికి సైతం మనశ్శాంతి కరువే కాక తప్పదు.
ఏది ఏమైనా నైరుతి రుతుపవనాల రాకతో కూల్‌కూల్‌గా, హాయ్హాయ్గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ వాతావరణం కూడా ఇట్లే వుంటే బాగుంటుందనే ఆశ ప్రతి ఒక్కరిలో వుంది.