తానిచ్చిన ఎగ్జిట్ పోల్ సహేతుకంగా లేదని 24 గంటలు గడిచే సరికి ఇండియా టుడే గుర్తించింది. ఎగ్జిట్ పోల్ పుణ్యమా అని తాను అభాసుపాలైనట్టు ఇండియా టుడే గ్రహించింది. దీంతో ఎలాగోలా ఎగ్జిట్ పోల్ తప్పిదం నుంచి బయటపడేందుకు ఇండియా టుడే ప్రయాస పడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చే సరికి… ఒకరోజు గ్యాప్‌లో భారీ తేడా కనిపించింది.
ఎన్డీఏకి అనుకూల ఫలితాలను ప్రకటించాలనే తాపత్రయంలో లాజిక్ మిస్ అవుతున్న విషయాన్ని గ్రహించలేదు. ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమైంది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్.
ఇండియా టుడే -యాక్సిస్ మై ఇండియా శనివారం ఎగ్జిట్ పోల్ వెలువరించింది. ఏపీలో ఎన్డీఏ కూటమి 53 శాతం ఓటు షేర్‌తో 21 నుంచి 23 ఎంపీ స్థానాలను, అలాగే 41 శాతం ఓటు షేర్‌తో వైసీపీ 2 లేదా 4 ఎంపీ స్థానాలను మాత్రమే దక్కించుకుంటుందని ప్రకటించింది. ఈ ఫలితాలపై ఏపీ ప్రజలు నివ్వెరపోయారు. ఇదేం సర్వే, ఎవరి కోసం ఇంత అన్యాయంగా ఇచ్చారనే విమర్శ వెల్లువెత్తింది.
ఒకరోజు ఆలస్యంగా ఆదివారం ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఇదే సంస్థ ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించింది. కూటమికి 98 నుంచి 120, వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు దక్కొచ్చని అంచనా వేయడం గమనార్హం. అసెంబ్లీ సీట్లలో వైసీపీకి మూడు శాతం ఓట్లు పెరగడంతో పాటు కూటమికి రెండు శాతం తగ్గడం గమనార్హం. ఇండియా టుడే -యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కాస్త…ఆ సంస్థను పూల్ చేసిందనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కీలక కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులను తాను స్వయంగా చూశానని, మీ సర్వే సహేతుకంగా లేదని యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు తలంటారు. ఏపీ ఎగ్జిట్ పోల్‌కు సంబంధించి ఇండియా టుడే అభాసుపాలైందన్న చర్చకు తెరలేచింది.
ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో భారీ వ్యత్యాసం కనిపించడం ఏంటనే నిలదీత ఎదురవుతోంది. ఇండియా టుడే -యాక్సిస్ మై ఇండియా వెల్లడించిన ఎంపీ సీట్ల వివరాల ప్రకారం… వైసీపీకి కేవలం 20లోపు ఎమ్మెల్యే సీట్లు రావాలి. అయితే పరువు పోతుందని గ్రహించి, తనను తానే ఎగ్జిట్ పోల్‌ను సరి చేసుకున్నట్టు వాటి లెక్కలు చెబుతున్నాయి. జాతీయ చానళ్ల ఎగ్జిట్ పోల్ ఫలితాల డొల్లతనాన్ని ఇండియా టుడే తనకు తానుగా బయటపెట్టుకున్నట్టైంది. ఎగ్జిట్ పోల్ పేరుతో డ్రామాలను చూస్తున్న జనం నవ్వుకుంటున్నారు.