ఉత్తరాంధ్రకు సీఎం ఆయనేనా?

ఉత్తరాంధ్ర అంటే వలసలకు అడ్డాగా చెబుతారు. శ్రీకాకుళం నుంచి మొదలెడితే విశాఖ రూరల్ జిల్లా వరకూ పేదలు అంతా ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస పోతూంటారు. ఎన్నికల వేళకు ఓట్లేసేందుకు…

ఉత్తరాంధ్ర అంటే వలసలకు అడ్డాగా చెబుతారు. శ్రీకాకుళం నుంచి మొదలెడితే విశాఖ రూరల్ జిల్లా వరకూ పేదలు అంతా ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస పోతూంటారు. ఎన్నికల వేళకు ఓట్లేసేందుకు వస్తారు. అలాగే సంక్రాంతి వంటి పెద్ద పండుగలకు కనిపిస్తారు.

ఊరు పొమ్మంటోంది ఉపాధి రమ్మంటోంది అన్నది వారు నేర్చిన జీవిత సత్యం. అదే ఉత్తరాంధ్రలో రాజకీయ వలసలు కూడా ఎక్కువే. ఇతర ప్రాంతాల నుంచి నేతలు వివిధ పనుల మీద వచ్చిన వారు అంగబలం అర్ధబలం చూసుకుని ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా ప్రతినిధులు అవుతారు.

అలాంటి వారు విశాఖతో పాటు ఇపుడు శ్రీకాకుళం దాకా విస్తరించి ఉన్నారు. విశాఖ కాస్మోపాలిటిన్ కల్చర్ ఉన్న సిటీ కాబట్టి ఎవరు ఎక్కడ నుంచి వచ్చినా పోటీ చేయవచ్చు. గెలవవచ్చు. ఇపుడు మరో లిట్మస్ టెస్ట్ కి తెర తీశారు సీఎం రమేష్.

ఆయన కడప జిల్లాకు చెందిన నేత. పది జిల్లాలు దాటుకుని విశాఖకు చేరుకున్న ఆయన అనకాపల్లితో రాజకీయ బంధం పెనవేసుకున్నారు. ఎంపీగా అనకాపల్లి వంటి పూర్తి గ్రామీణ నేపధ్యం ఉన్న సీటులో నుంచి పోటీ చేశారు. అది కూడా బీజేపీ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన ఎలక్షనీరింగ్ అద్భుతం అని పోలింగ్ సరళి చూసిన వారు అపుడే చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ రమేష్ విజయాన్ని ఖాయం చేశాయి. దాంతో ఆయన కాబోయే ఎంపీగా ట్యాగ్ తగిలించేసుకున్నారు.

అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గెలిస్తే కనుక ఆయన ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కేంద్ర బిందువు అవుతారు అని ఒక చర్చ సాగుతోంది. సీఎం రమేష్ కి బీజేపీ కేంద్ర పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, తెలుగుదేశం అధినాయకత్వంతో దశాబ్దాల పాటు ఉన్న రిలేషన్స్ అన్నీ కలసి ఉత్తరాంధ్రకు సరికొత్త నాయకుడు అవుతారు అని అంటున్నారు.

ఆయన మాట చలామణీ కావడం తధ్యమని అంటున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయం సాఫ్ట్ గా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఇప్పటికే శాసిస్తూ వస్తున్నారు. ఇక మీదట వారి నుంచి సీఎం రమేష్ ఆ బాధ్యతలు అందుకుంటారని కేరాఫ్ ఉత్తరాంధ్ర అంటే ఆయనే కనిపిస్తారని అంటున్నారు.