Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఫలితం ఎలా ఉన్నా.. ప్రజలు గెలవాలి

ఫలితం ఎలా ఉన్నా.. ప్రజలు గెలవాలి

నవీనయుగంలో ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం సమూలంగా మారిపోయింది. ‘ప్రజల యొక్క, ప్రజల కొరకు, ప్రజల చేత నడిచే వ్యవస్థ ప్రజాస్వామ్యం’ అనే వ్యక్తీకరణకు కాలదోషం పట్టింది. ప్రజల చేత ఎన్నుకోబడడం- అనేది ఒక లాంఛనం! ప్రజల యొక్క ప్రభుత్వం- అనేది  ఒక వంచన! ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం- అనేది ఒక మిథ్య!

పార్టీలు ఎప్పుడూ గొప్ప లక్ష్యాలను చెప్పుకుంటూనే ప్రజల ఎదుట నిల్చుంటాయి! కానీ ఆచరణలో ఎందరు ఎంత చిత్తశుద్ధితో, పట్టుదలతో శ్రమదమాదులకు ఓర్చి నిలబడ్డారనేదే ముఖ్యం. ప్రభుత్వాలు నడిపే ఒకరిద్దరు ప్రజల పట్ల ఎలాంటి అంకితభావంతో ఉన్నారనేది చాలదు. ఇప్పుడు మనం రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తును, గమనాన్ని నిర్దేశించే సమయకూడలిలో ఉన్నాం. ఎన్నికల ఫలితాలు రాబోతున్న ఈ సమయంలో.. గెలుపు ఓటుములు ఎవరికి దక్కుతాయనే చర్చ వివేకవంతమైనది కాదు. రాజకీయపరమైన ఫలితాలు  ఎలా ఉన్నప్పటికీ.. అంతిమంగా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించే వాదనే, ఆదిశగా ఉన్న లోపాలను ప్రస్తావించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఫలితం ఎలా ఉన్నా.. ప్రజలు గెలవాలి!’

మీరు ఎన్నుకున్న నాయకులు మీ ఎదుటనే ఉంటారు. మీరు అర్థం చేసుకోగల కార్యభారం ఏదీ లేకపోయినప్పటికీ.. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరచుగా యాత్రలు  చేస్తుంటారు! మర్మం ఏమిటన్నమాట? వారు నాయకులుగానే మీ ముందు మెదలుతూ ఉన్నారన్నమాట! వారి వారి వ్యక్తిగత జీవితాల సరికొత్త శిఖరాలను, సంపదల సామ్రాజ్యాలను మీ కళ్లు గప్పి, లేదా, మీ కనుల చూడగల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో సృష్టించుకుంటూ ఉన్నారన్నమాట! నాయకులుగా వారు మీ ముందు మంచిగానే కనిపించవచ్చు. మీరు నివేదించుకుంటున్న సమస్యలను శ్రద్ధగానే ఆలకిస్తుండవచ్చు. చాలా ప్రశంసనీయంగానే స్పందిస్తుండవచ్చు. కానీ.. తమ సొంతానికి వచ్చేసరికి.. సొంత రాష్ట్రాన్ని పరాయి నేలలాగా చూడడం.. పొరుగు రాష్ట్రాలను  సమృద్ధిగల వనరులుగా ఎంచుకోవడం ఎలా అర్థం చేసుకోవాలి?

కారణం ఒక్కటే! వారికి రాష్ట్ర ప్రజల నిజమైన వికాసం పట్ల శ్రద్ధ, పట్టింపు లేవు! రాష్ట్రం యొక్క స్థిరమైన పురోగమనం పట్ల ఆసక్తి లేదు! అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం తమది.. అధికారంలో లేనప్పుడు.. ఇది తమకు పరాయిగడ్డ.. అనే సంకుచితమైన ధోరణి చాలా మందిలో ఉంది. అధికారం ఇస్తున్నంత వరకే ఏపీ ప్రజలు మనవాళ్లు.. లేకుంటే పరాయివాళ్లు అన్నమాట!

శోచనీయమైన విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధుల్లో దాదాపు 70 శాతం మందికి పైగా హైదరాబాదులో స్థిరనివాసాలు ఉన్నాయి. వారి ప్రధాన వనరులైన వ్యాపారాలు హైదరాబాదు కేంద్రంగానే నడుస్తుంటాయి. ప్రజల మధ్య ఫోటో సెషన్ల కనిపించడానికి, వినిపించడానికి మధ్య మాయమయ్యే ప్రతి క్షణాన్ని వారు పొరుగురాష్ట్రాల్లోనే తమ సొంత ఆస్తులను వృద్ధి చేసుకుంటున్న ప్రాంతాల్లోనే గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు.

ఒక వాదన రావొచ్చు. ‘ఇప్పుడు ఆస్థాయి నాయకులుగా ఎదుగుతున్న వారు.. ఎప్పటినుంచో హైదరాబాదు కేంద్రంగా జీవిస్తున్నారు కదా.. ఆ మాత్రం ఆస్తులు లేకుండా ఉంటాయా?’ అని! కానీ, ఆ వాదన కేవలం ఆత్మవంచన!! రాష్ట్రవిభజన తర్వాత ఈ పదేళ్ల కాలంలో కూడా వారు ఆంధ్రప్రదేశ్ ను పూర్తిస్థాయిలో తమ సొంత రాష్ట్రంగా భావించలేకపోతున్నారన్నమాట. ప్రజల ఆవేదన కేవలం వారి నివాసాల గురించి మాత్రమే కాదు.. ఏపీలో రాజకీయంగా ఎదుగుతూ.. అక్కడి వక్రమార్గాల ఆర్జనలతో ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు వృద్ధి చేసుకుంటూ ఉండడం గురించే!

నాయకుల్లోని ఇలాంటి దుర్మార్గమైన పోకడలను గుర్తుచేసుకుంటున్నప్పుడు.. అందరికంటె ముందు చంద్రబాబునాయుడు గుర్తుకు వస్తారు. ఆయన రాష్ట్రం పట్ల వ్యక్తిగతమైన ముడి, కనెక్షన్, అక్కడి ప్రజలు తన వారనే భావన ఇసుమంతైనా లేవా? అనే బాధ కలుగుతుంది. రాష్ట్రం విడిపోయి పదేళ్లయింది. తొలి అయిదేళ్లు ఆయనే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోడ్డు పక్కన నిలబెట్టిన బస్సులో కాపురం ఉండడానికి ఇష్టపడ్డారు గానీ.. చంద్రబాబు తాను మాయమాటలు చెబుతున్న రాజధానిలో ఒక సొంత ఇల్లు చేసుకోలేకపోయారు. అలాగని ఒక భవంతిని నిర్మించుకోలేని, కొనుక్కోలేని పేదవాడా? అనుకోడానికి వీల్లేదు. కానీ ఆయనకు ఆ ఉద్దేశం లేదు. అక్రమకట్టడం అయిన లింగమనేని ఇల్లు ఒక్కటే ఆయనకు నచ్చిందని కూడా అనుకుందాం.. దానినైనా ఆయన కొనుక్కోలేదు.

కేవలం అద్దె ఇంట్లో ఉంటూ పాలన సాగించారు. రాష్ట్రం పట్ల ఒక అనుబంధం ఏర్పాటుచేసుకోలేని.. అసంగతమైన నాయకత్వం యొక్క ఫలితం ఇది. ఆయన కుటుంబ వ్యాపారాలు అన్నీ కూడా హైదరాబాదు కేంద్రంగా సాగేవే. ఏపీలో వ్యాపార విస్తరణలను కేవలం అమరావతి ప్రాంతంలో భూదందా నిర్వహించడానికి ఒక మార్గంగా మాత్రమే ఆయన భావించారు. ఏపీలో సీఎం అయిన తర్వాతనే హైదరాబాదులో అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నారు. కానీ ఏపీలో ముఖ్యమంత్రిగా తనకంటూ ఓ కాటేజీ కూడా కట్టుకోలేదు. ఇదే వైచిత్రి.. రాష్ట్రం యొక్క ఖర్మ!

చాలా మంది అలాంటి నాయకులే తయారవుతున్నారు. అయితే వేర్వేరు కారణాలు ఉంటున్నాయి. ప్రభుత్వంలో భాగంగా ఉండే అనేక మంది పెద్దలు అధికార బాధ్యతలను మొక్కుబడిగా నిర్వహించడం మినహా.. తమ వ్యక్తిగత జీవితం ఒక ఉదాహరణగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సమగ్ర వికాసానికి ఏరకమైన నిదర్శనంగా నిలుస్తున్నారనేది గమనించాలి. 

ఈ జాడ్యం ఇప్పటిది కాదు..

రాజకీయం కట్టబెట్టిన అధికార పదవుల్లో తులతూగుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్డదారుల్లో ఇబ్బడిముబ్బడిగా సంపాదించేసి.. ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పెట్టుబడులుగా పెడుతూ వ్యాపారాలు సాగించే ధోరణి అచ్చంగా గత పదేళ్లలోనో, అంతకు కాస్త ముందువెనుకగానో పుట్టినది ఎంతమాత్రమూ కాదు! తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత.. ఇలాంటి పోకడలు చాలానే మన రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాయి. అప్పటివరకు సామాన్యమైన, ఎగువమధ్యతరగతి కుటుంబాల్లో ఉంటూ రామారావు చలవతో రాజకీయ అరంగేట్రం చేసిన కొందరు పెద్దలు.. మంత్రి పదవుల్లో ఇబ్బడిముబ్బడిగా సంపాదించేసి.. పొరుగు రాష్ట్రాల్లో వందల ఎకరాల్లో కొనుగోళ్లతో దందాలు సాగించారు.

ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకని.. తర్వాత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు కూడా.. మన రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతూ వెనకేసిన  అక్రమ సంపాదన మొత్తం సింగపూర్ లో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

ఇక్కడ కీలకంగా గమనించాల్సిన సంగతి ఏంటంటే.. రాష్ట్రంలో అడ్డగోలుగా దోచుకుని.. ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు పెంచుకుంటూ నాయకులు చెలరేగిపోవడం వెనుక అప్పటికీ ఇప్పటికీ మూలకారణాల్లో వ్యత్యాసాలున్నాయి. అప్పట్లో.. మంత్రి పదవులు వెలగబెట్టినా సరే.. చాలా మంది నాయకులు ఎగువమధ్యతరగతి కుటుంబాల వారు.. దోచుకోవడం షురూ చేసిన తర్వాత.. ఇక్కడే వ్యాపారాలు, సంపదలు పెంచుకుంటే.. ప్రజలందరూ తమ అక్రమార్జనలను గుర్తించేస్తారనే భయంతో.. ఇతర రాష్ట్రాల్లో పెట్టేవారు. ఎన్టీఆర్ హయాం నాటి కొందరు మంత్రుల వందల కోట్ల ఆస్తులు ఇప్పటికీ బెంగుళూరు, చెన్నై తదితర నగరాల్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కానీ ఈ తరం నాయకులు.. రాష్ట్రంలో దోచుకుని.. పక్క రాష్ట్రాల్లో సంపదలను వృద్ధి చేసుకుంటూ గడపడానికి ప్రధాన కారణం భయం. అధికారంలో ఉన్నంతవరకు దోచుకోవడం హాయిగానే ఉంటుంది గానీ.. ఏదో ఒకనాటికి అధికారం అటు ఇటు అయితే.. తమ ప్రత్యర్థులు గద్దెమీదికి వస్తే, తమ భరతం పడతారనే భయం! అందువల్లనే ఎవ్వరూ టెక్నికల్ గా నివాసాలు ఏపీలో ఉంటున్నారు తప్ప.. వారి వ్యక్తిగత సంపదల సామ్రాజ్యాలను ఇటు హైదరాబాదులో, బెంగుళూరులో, చెన్నైలలో వృద్ధి చేసుకుంటున్నారు. రాష్ట్ర సమష్టి పురోగతికి చేటుచేసే వ్యవహారం ఇది. 

ఆ నాయకులకు భయం ఒక కారణం..

చాలా మంది నాయకులు ఏపీతో మనస్పూర్తిగా అనుబంధం పెంచుకోకపోవడానికి ఒక కారణం భయం. ఇవాళ్టి రాజకీయాలు.. కేవలం ప్రజాసేవకోసం అనే ముసుగులో, అధికారం కోసం తపించే రణరంగం అనే దశను దాటిపోయాయి. రాజకీయ వైరం అనేది వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకు వేదికలుగా మారిపోయాయి. అధికారం ఎవరి చేతిలో ఉన్నా సరే.. అది తమ చేతిలో ఉన్నంత కాలం ప్రత్యర్థిని వెంటాడి వేధించడమే మార్గంగా మారిపోయింది. తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను వేధించడం, వారి ఆస్తులను, వ్యాపారాలను దెబ్బతీయడం అనేది అలవాటుగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా.. అలాంటి చర్యలకు ప్రతీకార రాజకీయాలే సర్వసాధారణం అయ్యాయి.

ఇలాంటి వాటి పర్యవసానంగా.. అసలు ఏపీలో స్థిరమైన వ్యాపారం పట్ల ఏ రాజకీయ నాయకుడికి కూడా శ్రద్ధ లేకుండాపోయింది. ఏమో భవిష్యత్తులో ఏదో ఒక నాటికి అధికారం తమ చేతినుంచి జారిపోయినప్పుడు.. తాము ప్రత్యర్థుల చేతిలో పాట్లు పడాల్సి వస్తుందనే  భయం వారిని ఇతర రాష్ట్రాల్లో విస్తరించేలా చేస్తోంది. ఇలాంటి పోకడల మధ్య ఏపీలో యువతరానికి స్థానికంగానే మెరుగైన అవకాశాలు దక్కడం అనేది ఎలా సాధ్యమవుతుంది. వారంతా పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లే పరిస్థితి. రాజకీయ విభేదాలు తమను వ్యక్తిగతంగా వ్యాపారపరంగా టార్గెట్ చేసే వాతావరణం వారిని భయపెడుతోంది. ఇలాంటి పరిస్థితులే రాష్ట్ర వినాశనానికి దారితీస్తున్నాయి. 

నాయకుల ధోరణి మారాలి..

ఇప్పుడు జరిగిన ఎన్నికల నేపథ్యంలో గుడ్డిలో మెల్లలా ఆశావహంగా కనిపిస్తున్న పరిణామం ఏంటంటే.. అభ్యర్థులు అందరూ కులీనులు కాదు. అత్యంత సామాన్యులు కూడా ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఒక సాధారణ టిప్పరు డ్రైవరును, అంతకంటె సామాన్యులను కూడా ఎన్నికల బరిలో మోహరించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక సాహసం చేశారనే చెప్పాలి. ఇలాంటి వారు నాయకులు కావడం వలన.. పైన చెప్పుకున్న బాధాకరమైన పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుంది. వారు సంపదలతో తులతూగే వారు కాదు.. వారి దృష్టి నిత్యం ఇతర రాష్ట్రాల్లో విస్తరించే వ్యాపారాల మీద ఉండదు. గెలిస్తే అక్కడి ప్రజలకోసమే పనిచేస్తారు.

ఏ సామాన్య, మధ్య తరగతికి తాము ప్రతినిధులమో వారి వికాసానికి ప్రయత్నిస్తారు. ఓడిపోయినా.. అలాంటి వారి పక్షాన నిలబడి తమ బాధ్యతను విస్మరించకుండా ఉంటారు. పైన చెప్పుకున్న పరిస్థితులను రూపుమాపగల అనేక మార్గాల్లో ఇది ఒక చిన్న అంశం మాత్రమే.

దీనిని మించి.. రాజకీయ వైరం అనేది ఎన్నికలతో ముగిసిపోతుందని.. మళ్లీ ఎన్నికల సమయంలో మాత్రమే పునరుజ్జీవం పొందుతుందని నాయకులు గ్రహించాలి. ప్రతి రెండు ఎన్నికల మధ్య.. పార్టీ రహితంగా ప్రతి నాయకుడి మదిలో ఒకటే ఆలోచన ఉండాలి.

‘‘నాయకులు అనే వాళ్లు రెండు పార్టీలకు చెందిన వాళ్లు కాదు! రెండు వర్గాలకు చెందిన వాళ్లు’’ అనుకోవాలి. ‘‘ఒకటి- అధికారంలో ఉండి ప్రజలకోసం పనిచేసే వర్గం- రెండోది, ప్రజల మద్యలోనే ఉంటూ అధికారంలో ఉన్నవారితో పనిచేయించే వర్గం’’ అనే రకంగా నిర్వచనాలను మార్చుకోవాలి.  ఇలాంటి దృక్పథంతో ముందుకు సాగపితే.. పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే సంకుచితమైన కార్యకలాపాలు ఉండవు. మాటల్లో చెప్పుకోడానికి సులువుగానే ఉంటుంది.. ఆచరణలో చాలా కష్టం! ఆలాగని ఆలోచన కూడా చేయకుండా ఉండడం కూడా  నేరమే.

ఎన్నికల తర్వాత.. నాయకులు సమష్టిగా ప్రజల సేవకులం తాము అని తెలుసుకోవాలి. తమను తాము పార్టీ మనుషులుగా కాకుండా ప్రజల మనుషులుగా చూసుకోవాలి. రాజకీయ కక్షలు కార్పణ్యాలు హత్యలకు దారితీస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ‘ఐడియల్స్’ నవ్వు తెప్పించవచ్చు.. కానీ అసాధ్యం కాదు. అలా జరిగినప్పుడు.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజలు గెలిచినట్టు అవుతుంది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఆదర్శ వాతావరణం హఠాత్తుగా ఏర్పడాలనే అత్యాశ మనకు లేదు.. కనీసం ఆ దిశగా చిన్న బీజం పడితే చాలు.. అదే ప్రజలు గెలిచినట్టు అవుతుంది. 

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?