గతానికి భిన్నంగా ఈసారి పోటీ చేసిన ఇండిపెండెంట్ నుంచి ప్రధాన పార్టీ వరకూ అభ్యర్ధులు అందరికీ గట్టి పోలీస్ బందోబస్తునిని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం ఉన్న అభ్యర్థుల ఇళ్ళ వద్ద ఈ నెల 4న ఓట్ల లెక్కింపు రోజున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీస్ అధికారులు తెలియచేస్తున్నారు.
అంతే కాకుండా వారి ఎన్నికల కార్యాలయాల వద్ద కూడా బందోబస్తుని తగిన భద్రతను కల్పిస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 79 మొబైల్ పార్టీలకు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో క్విక్ రెస్పాన్స్ టీములను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈసారి ఎన్నికలు చావా రేవా అన్నట్లుగా సాగాయి కాబట్టి ఫలితాల ప్రకటన తరువాత భారీ ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుంటాయన్న సమాచారం నేపధ్యంలో కనీ వినీ ఎరగని తీరున ఈ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు.
దీంతో ఎమ్మెల్యే కాకపోయినా పోటీ చేసిన భాగ్యానికి ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్లుగా ప్రతీ అభ్యర్థి దర్జాగా పోలీసు బందోబస్తుతో తన ఇంటి ముందు వెలిగిపోతారని అంటున్నారు. అధికార వైభోగం ఆ విధంగా ఒక్క రోజు అయినా అందుకునే అవకాశం దక్కుతోంది అని అంటున్నారు. విశాఖ ఎపుడూ ప్రశాంతానికి మారు పేరుగా ఉంది. ఈసారి అల్లర్లు గొడవలు జరుగుతాయని సమాచారం ఉండడం కలవరం రేగుతోంది.