జూన్ లోకి ఎంటరైంది టాలీవుడ్. ఈ నెలను కల్కి మంత్ గా పిలుస్తున్నారు. అది నిజం కూడా. ఆ మాటకొస్తే, తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం కల్కి కోసం ఎదురుచూస్తోంది. ఈ నెల్లోనే కాదు, ఈ ఏడాదిలోనే పెద్ద సినిమా ఇది. మరి మిగతా సినిమాల సంగతేంటి?
జూన్ మొదటి వారంలో.. దాదాపు అర డజను సినిమాలొస్తున్నాయి. వీటిలో శర్వానంద్ నటించిన మనమే ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. తాజాగా ట్రయిలర్ రిలీజైంది. దీంతో ఓ మోస్తరుగా అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాతో పాటు సత్యభామ, లవ్ మౌళి, రక్షణ లాంటి సినిమాలు కూడా ఈ వారంలోనే వస్తున్నాయి. కమర్షియల్ హీరోయిన్ కాజల్ తొలిసారి చేసిన ఫుల్ లెంగ్త్ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా సత్యభామ. దీంతో పాటు.. పాయల్ లీడ్ రోల్ పోషించిన రక్షణ, నవదీప్ రీఎంట్రీ మూవీ లవ్ మౌళి కూడా ఇదే వారంలో వస్తున్నాయి.
రెండో వారంలో కూడా సినిమా సందడి బాగానే ఉంది. రాయన్, ఇంద్రాణి లాంటి సినిమాలు 13న రిలీజ్ అవుతుండగా.. ఒక రోజు గ్యాప్ ఇచ్చి హరోం హర, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ లాంటి సినిమాలొస్తున్నాయి. వీటిలో సుధీర్ బాబు నటించిన హరోంహర సినిమా ట్రయిలర్ తో ఆకట్టుకుంటోంది. ఇక ధనుష్ నటిస్తున్న 50వ చిత్రంగా రాయన్ పై అంచనాలున్నాయి.
ఈనెల మూడో వారంలో మాత్రం ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ రిలీజెస్ లేవు. దీనికి కారణం కల్కి సినిమా. 27న కల్కి సినిమా థియేటర్లలోకి వస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీపిక పదుకోన్, దిశాపటానీ లాంటి హీరోయిన్లు.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ ఉండడం ఈ సినిమా వెయిట్ ను మరింత పెంచింది. దీనికితోడు ప్రచారం కూడా భారీ ఎత్తున జరుగుతోంది.
ఈ అంచనాలకు తగ్గట్టే విడుదలకు ముందు, విడుదల తర్వాత వారం రోజులు అటుఇటు ఎలాంటి సినిమా పోటీ లేకుండా చూస్తున్నారు మేకర్స్. ఇక్కడ మాత్రమే కాదు, బాలీవుడ్ లో కూడా ఫ్లాట్ ఫామ్ సెట్ చేశారు. అలా కల్కి సినిమా సోలోగా థియేటర్లలోకి వస్తోంది.
సలార్ లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో కల్కిపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇంత హంగామా నడుస్తోంది కాబట్టే, జూన్ నెలను కల్కి మంత్ గా అభివర్ణిస్తున్నారు. సమ్మర్ లో మెరవలేకపోయిన బాక్సాఫీస్, కల్కితో కుదుటపడుతుందేమో చూడాలి.