రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపడతారని మంత్రి ఆర్కే రోజా ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్‌కు ముందు శ్రీవారి దర్శనం చేసుకున్నట్టు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎవరికి కావాల్సిన వార్తా కథనాలు వాళ్లు వండుకున్నారని ఎద్దేవా చేశారు.
ఎగ్జిట్ పోల్స్‌లో ఎవరేం చెప్పినా రెండోసారి సీఎం జగన్ కావడం పక్కా అని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టే, రాత్రి అయినా సరే వృద్ధులు, మహిళలు ఓట్లు వేయడానికి క్యూలో నిలిచారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అని ఆమె ప్రశంసలతో ముంచెత్తారు.
మరోసారి అధికారంపై విశ్వాసంతో ఉన్నామని రోజా అన్నారు. కూటమి అనేది కొత్తగా ఇప్పుడే ఏర్పడింది కాదన్నారు. 2014లో కొత్త కాంబినేషన్ కావడంతో ఏదో చేస్తారనే అంచనాతో ప్రజలు ఓట్లు వేశారన్నారు. 2014లో ఇటు ఏపీలో, అటు జాతీయ స్థాయిలో కూటమి అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప, చేసిందేమీ లేదని తెలుసుకునే ప్రజలు ఓడించారన్నారు. ఇప్పుడు కూటమికి క్రేజ్ లేదని రోజా అన్నారు.
ఇదిలా వుండగా రోజా ఓడిపోతారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైనట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రోజా మాత్రం హుషారుగా కనిపించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం విశేషం.