ఎగ్జిట్ పోల్స్ తేల్చిందిదే !

ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమికే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంక్ ప్లస్ జనసేనకు ఉన్న సామాజిక బలం, బీజేపీ ద్వారా మోడీకి ఉన్న ఇమేజ్ ని బేస్ చేసుకుని…

ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమికే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంక్ ప్లస్ జనసేనకు ఉన్న సామాజిక బలం, బీజేపీ ద్వారా మోడీకి ఉన్న ఇమేజ్ ని బేస్ చేసుకుని టీడీపీ కూటమి వైపు చాలా ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపినట్లుగా ఉంది.

వైసీపీ గెలుస్తుంది అనుకున్న సీట్లలో కూడా టీడీపీకే చాన్స్ అని అనేక సర్వేలు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఈసారి ఎన్నికల్లో నాన్ లోకల్ కార్డ్ నెగిటివ్ గా పనిచేయలేదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే అర్ధం అవుతుంది. 

నెక్ టూ నెక్ అన్న సీట్లలో కూటమికే ఎడ్జి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. విజయనగరం లాంటి వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలలో కూటమికి సగం సీట్లు కట్టబెట్టడం బొత్స సత్యనారాయణ వంటి వారు సైతం తక్కువలో తక్కువ ఓట్లతో గెలవవచ్చు అని చెప్పడం కూడా ఆలోచింపచేస్తోంది.

ప్రమాణాలు కొలమానాలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అన్నది కూడా తర్కించుకునే పరిస్థితి ఉంది. దేశంలో ఎన్డీయే సర్వేల ప్రభావం ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వేల మీద పడింది అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కి అసలు రిజల్ట్ కి మధ్య తేడా ఏమిటి అన్నది జూన్ 4న చూడాల్సి ఉంది.

ఏపీ ప్రజలు నరేంద్ర మోడీ ప్రభావానికి లోను అయ్యారా లేదా అన్నది కూడా ఆ రిజల్ట్ లోనే తెలుస్తుంది. కూటమికి ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు కట్టబెట్టడమే కాకుండా 2014 నాటి కంటే కూడా వైసీపీ సీట్లు తగ్గించి చూపారు అన్న వాదన ఉంది. అయితే ఇవి అసలు రిజల్ట్ కావని తామే  భారీ ఆధిక్యతతో గెలిచి తీరుతామని వైసీపీ నేతలు చెబుతున్నారు.