ఉమ్మడి రాజధాని వల్ల ఏపీకి ఏం ఒరుగుతుంది?

రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదారాబాదు ఉండేది మరో రెండు రోజులు మాత్రమే. జూన్ రెండో తేదీతో ఆ గడువు అయిపోతుంది. ఆ తరువాత హైదరాబాదు కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.…

రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదారాబాదు ఉండేది మరో రెండు రోజులు మాత్రమే. జూన్ రెండో తేదీతో ఆ గడువు అయిపోతుంది. ఆ తరువాత హైదరాబాదు కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఇప్పటికైనా విభజన చట్టం ప్రకారం మాత్రమే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంది. అంటే సాంకేతికంగా అన్నమాట. వాస్తవంగా అయితే తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంది.

రాష్ట్రం విడిపోయినప్పుడు అంటే 2014 లో  అప్పటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాదును పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది. ఆ గడువు ఇప్పుడు ముగుస్తోంది. దీంతో కొందరు ఏపీ నాయకులు హైదరాబాదును మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు. ఈమధ్యనే సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరో పదేళ్లు కొనసాగించాలని అన్నారు. ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేదు కాబట్టి, రాజధాని ఏర్పాటయ్యేవరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అన్నారు.

కానీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుగానీ, వైసీపీ అధినేత జగన్ గానీ ఉమ్మడి రాజధానిపై ఏమీ మాట్లాడిన దాఖలాలు లేవు. తాను అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. తాను పీఠం ఎక్కగానే అంటే తాను ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి వస్తాను అనే నమ్మకం ఉంది  కాబట్టి విశాఖను రాజధానిగా చేయాలని జగన్ అనుకుంటున్నారు. కాబట్టి వారిద్దరికీ ఉమ్మడి రాజధాని అవసరంలేదు. ఈ ఇద్దరి పక్షం కానివారు హైదరాబాదు ఇంకా ఉమ్మడి రాజధానిగా కొనసాగాలంటున్నారు.

పోనీ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్న వారు కేంద్రప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అయినా ఈ ప్రయత్నాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయాలి. అలా చేసినట్లు కనబడటంలేదు. అలాంటి ఆలోచన ఉన్నట్లయితే ప్రయత్నాలు చేసేవారేమో కానీ అలాంటి ఆలోచన లేదు. సరే.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు కొనసాగుతుందని అనుకుందాం. దానివల్ల ఏపీ ప్రజలకు ఒరిగేది ఏమిటి? కలిగే ప్రయోజనం ఏమిటి? వాస్తవానికి ఏమీ లేదు. పదేళ్ళపాటు రాజధాని లేకపోయినా ఉన్నట్లుగానే అంతా సాగిపోయింది.

అసెంబ్లీ సమావేశాలు జరగడం ఆగలేదు. ప్రభుత్వ కార్యకలాపాలు ఆగలేదు. రాజధాని లేకపోవడాన్ని ఏపీ ప్రజలు జీర్ణం చేసుకున్నారు. రాజధాని ఎందుకు లేదని ఇప్పుడు విశ్లేషించడం అనవసరం. ఆ సబ్జెక్టును ఎత్తుకుంటే మహాభారతమంత, రామాయణమంత అవుతుంది. ఏపీకి రాజధాని లేకపోవడం అక్కడి పాలకుల వైఫల్యమే. చంద్రబాబు అమరావతి
పేరుతో బాహుబలి టైపు నగరాన్ని నిర్మిస్తానని కథలు చెప్పారు. చివరకు ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్ అధికారంలోకి రాగానే దక్షిణాఫ్రికా టైపులో మూడు రాజధానులు అంటూ ఊదరగొట్టారు. ఈ ఇద్దరు సీఎంల వల్ల రాజధాని లేకుండా పోయింది.

ఏపీ ప్రజలకు హైదరాబాదే రాజధాని అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికంటే విడిపోయాకే ఏపీ నుంచి హైదరాబాదుకు వలసలు పెరిగాయి. వాచ్ మెన్ ఉద్యోగం మొదలుకొని పెద్ద ఉద్యోగాలవరకు హైదరాబాదుకు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా వాళ్ళను (ప్రజలను కాదు నాయకులనే) దూషించారుగానీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసి పోయారు. ఆంధ్రా వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. ఆస్తులు కొంటున్నారు. ఏపీకి చెందిన 70 శాతం నాయకుల ఆస్తులు, ఇళ్లు ఇక్కడే ఉన్నాయి. చంద్రబాబు, జగన్, పవన్ ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లు ఇక్కడే ఉన్నాయి.

ఇక ప్రభుత్వపరంగా చూసుకుంటే ఏపీకి హైదరాబాదులో దాని వాటాగా వచ్చిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి  దాదాపుగా అప్పగించేశారు. ఏపీ అధీనంలో ఉన్న మూడో నాలుగో భవనాలను కూడా రెండో తేదీ తరువాత తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఏపీ వాటిని ఉంచుకోవాలంటే రెంట్ పే చేయాలి. సచివాలయంలో ఏపీ భవనాలను జగన్ సర్కారు అప్పగించాకే కదా కేసీఆర్ కొత్త సచివాలయం కట్టాడు. హైదరాబాదులో ఏపీకి ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటాలు తేలాల్సి ఉంది. కానీ దాన్ని గురించి ఈ పదేళ్లలో ఇద్దరు సీఎంలు పట్టించుకోలేదు.

ఏపీకి 1. 25 లక్షల కోట్ల ఆస్తులు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కానట్లుగా ఉంది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు 2016 లోనే హైదరాబాదు వదిలి ఏపీకి వెళ్లిపోయారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తో, కేంద్రంతో గొడవ పెట్టుకోవడమే సరిపోయింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ కేసీఆర్ తో, కేంద్రంతో గొడవపడకుండా ఉన్నప్పటికీ విభజన సమస్యలను పరిష్కరించుకోలేదు.

మొత్తం మీద ఏపీ వాటాను సాధించడంలో ఏపీ పాలకులు విఫలమయ్యారు. హైదరాబాదు ఇంకా ఉమ్మడి రాజధానిగా అక్కరలేదు. వాటాల సంగతి తేల్చుకుంటే సరిపోతుంది.