ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం పని చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇదుకూరి రఘురాజుపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్, జంగా కృష్ణమూర్తిలపై మండలి చైర్మన్ మోషెన్‌రాజు వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రఘురాజు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారనేందుకు ఆధారాలు లభ్యం కావడంతో వేటుకు కౌంట్‌డౌన్ మొదలైంది.
విజయనగరం జిల్లా ఎస్.కోటలో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మీకి వ్యతిరేకంగా రఘురాజు టీడీపీ నేతలతో చేతులు కలిపారు. మరోవైపు తన భార్య, ఎస్.కోట వైస్ ఎంపీపీ సుబ్బలక్ష్మిని లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేర్పించారు. తనకు, తన భార్యకు రాజకీయంగా సంబంధం లేదంటూ రఘురాజు బుకాయించారు. కానీ చాటుమాటుగా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్న రఘురాజు బాగోతం ఎట్టకేలకు బయట పడింది.
దీంతో ఆయనపై వేటు వేయాలంటూ మండలి చైర్మన్‌కు వైసీపీ విప్ విక్రాంత్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు ఈ నెల 27న విచారణకు రావాలని రఘురాజుకు మండలి చైర్మన్ నోటీసు పంపారు. కానీ విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. దీంతో 31న విచారణకు రావాలంటూ మరోసారి నోటీసు పంపారు.
రఘురాజు హాజరుపై ఉత్కంఠ నెలకుంది. చివరికి రఘురాజుపై వేటు తప్పేలా లేదు. ఈ విషయం తెలిసే అతను విచారణకు వెళ్లడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.