యూనిఫార్మ్ సివిల్ కోడ్ ను భాజపాయేతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి సారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం సమర్థిస్తారని అనుకోవడం భ్రమ. అందరూ ఊహించినట్టుగానే.. ఆయన యూసీసీని వ్యతిరేకించారు. కాకపోతే.. యూసీసీ పట్ల భారాస వ్యతిరేకతను వెల్లడించిన తొలి ప్రకటన.. స్వతహాగా రాలేదు. మజ్లిస్ అధినేత ఒవైసీ నేతృత్వంలో ముస్లిం నాయకులు అనేక మంది వెళ్లి కేసీఆర్ తో భేటీ అయిన తర్వాతనే వచ్చింది. ఆ రకంగా ముస్లిం మతస్తుల కోసమే తాను యూసీసీని వ్యతిరేకిస్తున్నట్టుగా కేసీఆర్ ఒక సంకేతం పంపగలిగారు.
మజ్లిస్ నేతృత్వంలో ముస్లిం నాయకులు వచ్చి కలిసేదాకా కేసీఆర్ ఏం చేస్తున్నారు? యూసీసీకి అనుకూలంగా ఆయన భావజాలం ఉండేదా? లాంటి సందేహాలు ప్రజల్లో కలగడం సహజం. ఎందుకంటే.. చాలా పాతకాలం నుంచి ఉన్న సమస్య అయినటువంటి ఉమ్మడి పౌరస్మృతిని ఇటీవలి కాలంలో బిజెపి సర్కారు మళ్లీ చర్చల్లోకి తెస్తోంది.
దేశవ్యాప్తంగా దీని గురించే మాట్లాడుకునే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. బిజెపి సోషల్ మీడియా దళాలు దీని మీద చాలా ముమ్మరంగా పనిచేస్తున్నాయి. వారి ప్రధాన ఎజెండా హిందూత్వ కాబట్టి.. ముస్లిం ద్వేషం కాబట్టి.. యూసీసీ అనేది ఈ దేశానికి అవసరం అనే వాదనకంటె.. ముస్లిములను కట్టడి చేయడానికి అవసరం అనే విషప్రచారంతో దూసుకెళుతున్నారు.
యూసీసీ మీద ఇటీవలి చర్చ మొదలైన నాటినుంచి.. భాజపా వ్యతిరేక పక్షాలు ఈ ఆలోచనను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. మతాల ఆచారాల మధ్య అనేక సంక్లిష్టతలు ఉండే ఈ విశాలమైన దేశంలో… యూసీసీ వంటి ఇబ్బందికరమైన వ్యవహారం జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదని.. ఆ పని చేస్తే గనుక.. బిజెపికే నష్టం జరుగుతుందని గులాంనబీ ఆజాద్ లాంటి సీనియర్ నాయకులు చాలా తర్కబద్ధమైన సలహా ఇచ్చారు.
ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఇప్పటిదాకా పెదవివిప్పలేదు. ఇవాళ ముస్లిం నేతలు వెళ్లి కలిసిన తర్వాత.. యూసీసీని వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రంలో భారాస గెలవడానికి ముస్లిం ఓటు బ్యాంకు కూడా చాలా కీలకం. అందువల్ల.. ఇన్నాళ్ల మౌనం తర్వాత.. వారు వచ్చి అడిగితే.. వారి కోసమే వ్యతిరేకిస్తున్నట్టుగా ఆయన బిల్డప్ ఇవ్వడానికి సాధ్యమౌతోంది.
యూసీసీ ద్వారా బిజెపి విద్వేష రాజకీయం చేస్తోందని ఆరోపించారు. వ్యతిరేకించడం అనేది పార్టీ భావజాలంగా ఉంటే మంచిదే.. కానీ అది కూడా ఓటు బ్యాంకు రాజకీయంగా మార్చుకోవాలనుకుంటే మాత్రం.. అనుమానించాలి.