గతంలో మన జనాల మీద ఓ కామెంట్ వుండేది.
అమెరికాలో వుంటే అన్ని రూల్స్ పద్దతిగా పాటిస్తారు. చాలా క్రమశిక్షణతో వుంటారు. ఎందుకంటే అక్కడ భయం వుంది. కానీ అదే జనాలు మన దగ్గరకు వస్తే మళ్లీ మామూలైపోతారు. ఎందుకంటే ఇక్కడ భయం లేదు.
ఇదీ ఆ అభిప్రాయం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇక్కడే బెటర్ అనిపిస్తోంది. అమెరికాలో మనవాళ్లు చేస్తున్న ఆగం, అల్లరి అలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. నిజానికి దీని వెనుక వున్నది రెండే రెండు. ఒకటి కులం.. రెండోది రాజకీయం.
అమెరికా వెళ్లిన వాళ్లని మూడు రకాలుగా చూడాలి. ఒకటి మొదటి తరం. ఎక్కువగా డాక్టర్లు. రెండో తరం..ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. మూడో తరం అక్కడికి వెళ్లిన వాళ్ల ప్రాపకంతో, అవసరంతో ఏదోలా అక్కడికి చేరిన వారు. ఈ మూడు తరాలతో పెద్దగా ఇబ్బంది రాలేదు. అసోసియేషన్లు, సంఘాలు కులాల వారీగా ఏర్పాటు అవుతున్నా, ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ వస్తున్నారు. కానీ తెలుగునాట ఎలా అయితే రాను రాను కులపిచ్చి అతి భయంకరంగా పెరిగిపోయిందో, అదే జాఢ్యం అమెరికాకు కూడా పాకింది. కేవలం కులపిచ్చి పాకితే ఫరవాలేదు. రాజకీయాలు, వాటి వర్గాలు ఇవి కూడా సంఘాల్లోకి చేరాయి.
ప్రతిసారీ తానా సభలకు ముందు ఎవరో ఒకరు మీడియాను ఆశ్రయించడం, అందులోని లొసుగులు, భాగోతాలు ఏకరవుపెట్టడం, అవసరం అయితే ఇంటర్వూలు ఇవ్వడం, రిలేటెడ్ డాక్యుమెంట్స్ అందించడం కామన్ అయిపోయింది. ఎన్నికల్లో గెలవడం కోసం వీళ్ల మీద వాళ్లు, వాళ్ల మీద వీళ్లు బురద వేసుకోవడం పరిపాటి అయింది. అంతే కాదు ఇంకా చాలా చాలా వున్నాయి.
ఇదిలా వుంటే ఇప్పుడు ఓ కొత్తతరం వచ్చి చేరింది అమెరికాకు. అమెరికా ఇబ్బడి ముబ్బడిగా స్టూడెంట్ వీసాలు ఇవ్వడం, రెండేళ్ల కరోనా గ్యాప్ తరువాత వేల సంఖ్యలో మన కుర్రాళ్లు అమెరికా చేరడం జరిగిపోయింది. ఇప్పుడు కులాలు, సినిమా హీరోలు, రాజకీయ పార్టీల లెక్కన జనం చీలిపోయి, తన్నుకుని, కొట్టుకోవడం అమాంతం పెరిగిపోయింది. వేల మంది మన కుర్రాళ్లు అమెరికా చేరడం వల్ల లాభం ఏదైనా వుందా అంటే మన సినిమాల కలెక్షన్లు, అమ్మకం రేట్లు కొంత వరకు పెరిగాయి. అదొక్కటే సంతోషం.
కానీ ఇక్కడి కుర్రకారు జాఢ్యాలు అన్నీ అమెరికా చేరాయి. థియేటర్లలో గడబిడలు, బయట అల్లరి చిల్లరి పనులు, ఇలా ఒకటి కాదు. రెండు కాదు. ఈ కొత్తతరం వైఖరి చూసి, పైకి ఏమీ బాహాటంగా అనలేకపోయినా, మొదటి తరం, రెండో తరం జనాలు లో లోపల బాధపడుతున్నారన్నది వాస్తవం.
అయితే గమ్మత్తేమిటంటే ఇక్కడ కూడా ఆఫ్ ది రికార్డుగా వేరే తరహా కామెంట్లు చేస్తున్నారు. అందులో కూడా ఈ కులాల వైరాలు కనిపిస్తున్నాయి. ఫలానా కులం వారు ఎక్కువ మంది వచ్చారు. వాళ్ల వల్లే ఈ గడబిడలు అన్నీ అని కొందరు. కానీ ఫలానా వాళ్లు ముందు నుంచీ వున్నారు. ఇప్పుడు వీళ్లు రావడం కిట్టడం లేదు అని మరి కొందరు అంటున్నారు.
చూస్తుంటే రాను రాను ఈ వైరాలు ఎక్కువయ్యేలాగే వున్నాయి. పార్టీలు రెండు మూడే కావచ్చు. కానీ హీరోలు పది మంది వరకు వున్నారు. వీళ్ల సినిమాలు వస్తూనే వుంటాయి. ఆ గొడవలు వుండనే వుంటాయి. మొత్తం మీద అమెరికా కాస్తా తెలుగునాడు గా మారిపోతోంది.