ఏపీలో అధికార వైసీపీ విపక్ష టీడీపీల మధ్య ఎపుడూ ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ రెండు పార్టీలూ కూడా సదా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగానే ఉంటాయి. ఇపుడు మరో కొత్త ఫైటింగ్ కి రంగం సిధ్ధం అయింది. మహా విశాఖ నగరపాలక సంస్థ 99 వార్డులతో ఏపీలోనే అతి పెద్దదైన కార్పోరేషన్ గా ఉంది.
ఈ కార్పోరేషన్ లో ఏడాదికి ఒక మారు స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరుగుతుంది. పది మంది స్టాండింగ్ కమిటీ చైర్మన్లను ఎన్నుకుంటారు జీవీఎంసీలో వైసీపీదే అధికారం. మేయర్, డిప్యూటీ మేయర్లు ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు. మొత్తం అరవై మంది పై బడి కార్పోరేటర్లు వైసీపీకి ఉన్నారు.
టీడీపీకి ముప్పయి మంది కార్పోరేటర్లు ఉన్నారు. ముచ్చటగా మూడవ ఏడాది స్టాండింగ్ కమిటీ చైర్మన్ల ఎన్నిక కోసం వైసీపీ టీడీపీల మధ్య గమ్మత్తైన ఫైటింగ్ జరగనుంది. పదికి పది పోస్టులకు అభ్యర్ధులను మంత్రి గుడివాడ అమరనాధ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తరఫున తొమ్మిది పోస్టులకు అభ్యర్ధులను నిలబెట్టింది.
నామినేషన్లకు తుది గడువు ఈ నెల 11 కాగ ఎన్నికలు, రిజల్ట్ ని ఈ నెల 19న ప్రకటిస్తారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ల పదవులు కీలకమైనవి కావడంతో రెండు పార్టీలలో రాజకీయ సందడి మొదలైంది. గతసారి పదికి పది చైర్మన్లను వైసీపీ గెలుచుకుంది. ఈసారి మాకే బలం ఉంది కాబట్టి అదే రిజల్ట్ రిపీట్ అని వైసీపీ ధీమాగా చెబుతోంది. అయితే సీన్ మారుతుంది, మాకూ చోటు దక్కుతుంది చూడండి అని సవాల్ చేస్తోంది టీడీపీ. జీవీఎంసీలో సాగే ఈ మహా యుద్ధం రెండు పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.