ఏపీ రాజధానిగా అమరావతిని టీడీపీ కూటమి తో పాటు అంతా అంగీకరిస్తున్నారు. విభజన తరువాత ఏపీలో అన్ని పార్టీల స్టేట్ ఆఫీసులు అన్నీ కూడా విజయవాడ గుంటూరు లో ఉన్నాయి. వైసీపీ స్టేట్ ఆఫీసు తాడేపల్లిలో ఉంటే జనసేన టీడీపీ ఆఫీసులు మంగళగిరిలలో ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ వామపక్షాల ఆఫీసులు విజయవాడలో ఉన్నాయి.
అయితే విశాఖను పరిపాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అది న్యాయ పరిశీలనలో ఉంది. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణం చేసి అక్కడ నుంచి పాలిస్తాను అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. కౌంటింగ్ తరువాత జూన్ 9న విశాఖ వేదికగా ప్రమాణం అని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రుషికొండలో నూతనంగా భవనాలను క్యాంప్ ఆఫీసుగా చేసుకుని జగన్ పాలిస్తారు అని అంటున్నారు.
దీనికి అదనంగా మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. విశాఖ శివారులో ఏడాది క్రితం రెండు ఎకరాల భూమిలో విశాఖ వైసీపీ స్టేట్ ఆఫీస్ నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇది ఇపుడు దాదాపుగా పూర్తి కావచ్చింది.
సుమారు పదమూడు వేల చదరపు అడుగులతో నిర్మిస్తున్నారు. జీ ప్లస్ భవనాన్ని వైట్ బ్లూ గ్రీన్ కలర్స్ తో అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి అంతస్తులో పార్టీ అధినేత చాంబర్ తో పాటు మీటింగులు నిర్వహించుకునే సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.
జూన్ తరువాత మంచి ముహూర్తం చూసి వైసీపీ స్టేట్ ఆఫీసు కూడా విశాఖకు షిఫ్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇక మీదట వైసీపీ పార్టీ యాక్టివిటీస్ అన్నీ విశాఖ నుంచే సాగుతాయని చెబుతున్నారు. అటు పాలనా రాజధానిగా మాత్రమే కాకుండా రాజకీయ రాజధానిగా విశాఖను ఉంచాలన్న వైసీపీ ప్రయత్నం ఇది. వైసీపీ విశాఖకు షిఫ్ట్ అయితే ఆ బాటలో మిగిలిన ప్రధాన పార్టీలు పడతాయా అన్నది కూడా చూడాలని అంటున్నారు