ఉత్తరాంధ్ర అభివృద్ధి తన అజెండా అని చాలా కాలం క్రితమే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలని ఆయన కోరుకున్నారు. దాని కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమం అని కూడా కొన్నాళ్ళ పాటు చేశారు.
ఇపుడు ఆయన జనసేనలో నవ నాయకుడు. అంతకు ముందు కాంగ్రెస్ వైసీపీ టీడీపీలలో ఉన్న కొణతాల 2024లో జనసేన నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. విజయం తనదే అంటున్నారు. కాసేపు ఈ సంగతి పక్కన పెడితే ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీ కూటమి వల్లనే సాధ్యమని అంటున్నారు.
ఉత్తరాంధ్రలోని నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలు ఇతరత్రా ప్రగతి టీడీపీ కూటమి వస్తే చంద్రబాబు వల్లనే సాధ్యమని పదే పదే చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ఇంతలా అభివృద్ధి చెందితే అది మంచిదే కానీ ఉత్తరాంధ్రకే అసలైన పెద్ద దిక్కుగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం విషయం కొణతాల రామకృష్ణకి కనిపించడం లేదా అని అంటున్నారు.
అనకాపల్లిలో ఎన్నికల సభ నిర్వహించినా నరేంద్ర మోడీ విశాఖ ఉక్కు మీద కనీస హామీ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని భరోసా ఇవ్వలేదు. కానీ కూటమి అభ్యర్ధిగా కొణతాలకు మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధి మోడీ చంద్రబాబు సారధ్యంలో బ్రహ్మాండంగా సాగుతుందన్న నమ్మకం ఎలా వచ్చింది అని ఉక్కు ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద బాబు మోడీల నుంచి హామీని తీసుకుని ఉండినట్లు అయితే ఉత్తరాంధ్ర పట్ల మాజీ మంత్రికి ఉన్న ప్రేమ చిత్తశుద్ధి అన్నవి పూర్తిగా తెలిసేవని అంటున్నారు. అలా కాకుండా టీడీపీ ప్రభుత్వం వస్తే చాలు ఉత్తరాంధ్ర ప్రగతి ఉరకలు వేస్తుందని ఆయన చెప్పడం మాత్రం విమర్శల పాలు అవుతోంది. ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపితే వెనకబడిన జిల్లాలకు అదే అసలైన అభివృద్ధిగా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఉత్తరాంధ్ర ఉద్యమకారుల అజెండాలో విశాఖ ఉక్కు ఉందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.