జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుస్తారా అన్న దాని మీద బెట్టింగులు కాస్తున్నారు. కొన్ని చోట్ల గెలుపు కాదు మెజారిటీ మీదనే పందేలు సాగుతున్నాయి.
విశాఖలో అయితే పవన్ గెలుపు మీద లక్షకు నాలుగు లక్షలు అంటూ పందేలకు బృందాలు రెడీ అయిపోయాయి. పవన్ ఓడిపోతారు అన్న వారు లక్ష పందెంతో వస్తే వారి మాట నిజం అయితే నాలుగు లక్షలు ఎదురిచ్చి పంపుతామని పందెం రాయుళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు మీద అంత ధీమా తమకు ఉందని జనసేన అభిమానులు కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 2019లో గాజువాకలో పోటీ చేసినపుడు కూడా ఇంత పెద్ద మొత్తాలలో పందాలు కాయలేదు.
ఈసారి విశాఖకు సదూరంగా ఉన్న పిఠాపురంలో ఆయన గెలుపు కోసం సాగర తీరం ఉత్సాహం చూపిస్తోంది. పవన్ గెలిచి తీరుతారు అన్న నమ్మకం వ్యక్తం చేస్తోంది. గాజువాకలో పవన్ దాదాపుగా పదిహేడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఆనాడు రాజకీయం సరిగ్గా తెలియక అలా జరిగిందని ఈసారి అన్ని ఎత్తులూ వ్యూహాలతో పవన్ సంసిద్ధమై వచ్చారని గెలుపు తధ్యమని అంటున్నారు. లక్షకు నాలుగు లక్షలు పందెం బాగానే ఉంది.
పవన్ ఓడుతారు అని ఎవరు కాస్తారు. వైసీపీ నుంచే కాయాలి. చాలా మంది అయితే ఈ పందేలకు దూరం అని చెబుతున్నారు. విశాఖలో ఇప్పటికే చాలా సీట్ల మీద పందేలు జరుగుతున్నాయి. వాటిని పక్కన పెట్టి పిఠాపురం దాకా వెళ్లడం అవసరమా అని అంటున్న వారూ ఉన్నారు.
అయితే బెట్టింగుకు ప్రాంతాలతో పని ఏంటి అంటున్నారు. పవన్ గెలుపు మీద మాకు నూరు శాతం నమ్మకం ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. లక్షకు నాలుగు లక్షలు కాసిన వారికి శృంగభంగమే అంటున్నారు. ఈ పందేనికి సై అనే బెట్టింగ్ మొనగాడు ఎవరైనా ఉన్నారా అంటే ఏమో ఉండొచ్చు కూడా.