ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం మరో ఏడు రోజులు బెయిల్ గడువు పొడిగించాలన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జూన్ ఒకటో తేదీ తర్వాత ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీ మద్యం కేసులో ఆయన్ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఆయనకు మే 10 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 2న తిరిగి ఆయన లొంగిపోవాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో మరోసారి ఉపశమనం కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అకస్మాత్తుగా ఏడు కిలోల బరువు తగ్గడంతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యల గురించి కేజ్రీవాల్ తాజా పిటిషన్లో ప్రస్తావించారు. కావున వైద్య పరీక్షల నిమిత్తం ఐదు నుంచి ఏడురోజుల పాటు సమయం అవసరమని, జూన్ 9న లొంగిపోతానని కేజ్రీవాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టి వేసింది.
అలాగే పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. దీంతో కేజ్రీవాల్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై బీజేపీ పరోక్షంగా ఘాటు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.