ఉక్కు బతికి బట్ట కడుతుందా?

ఉక్కు ముక్క అని పోలిక దేనికైనా తేవడం జరుగుతుంది. అంటే అది శాశ్వతం అని తిరుగులేనిది అని పోలికగా చెబుతారు. అలాంటి ఉక్కుకి చెదలు పట్టాయంటే నమ్మరు కానీ నమ్మాల్సిందే. కేంద్రంలో మూడవసారి బీజేపీ…

ఉక్కు ముక్క అని పోలిక దేనికైనా తేవడం జరుగుతుంది. అంటే అది శాశ్వతం అని తిరుగులేనిది అని పోలికగా చెబుతారు. అలాంటి ఉక్కుకి చెదలు పట్టాయంటే నమ్మరు కానీ నమ్మాల్సిందే. కేంద్రంలో మూడవసారి బీజేపీ ప్రభుత్వం వస్తే మాత్రం ఆ రోజునే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎండ్ కార్డు పడినట్లే అంటున్నారు.

తొట్ట తొలి నిర్ణయం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీదనే ఉంటుంది అన్నది అందరికీ అర్థం అవుతున్న విషయం. అయినా పోరాటం ఆపడం లేదు. మూడేళ్ళ క్రితం 2021 ఫిబ్రవరి నెలాఖరులో విశాఖ ఉక్కు మీద వేటు పడుతుంది అని సూచనప్రాయంగా కేంద్రం చెప్పిన దగ్గర నుంచి విశాఖలో ఉద్యమం రాజుకుంది.

అది మే 26 నాటికి 1200 రోజులకు చేరుకుంది. ఈ దేశంలో ఇన్ని రోజులుగా ఉద్యమం ఆపకుండా నాన్ స్టాప్ గా చేసిన దాఖలాలు బహు తక్కువ. అలా ఉంటే వాటి కోవలోకి విశాఖ ఉక్కు చేరింది. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి అనకాపల్లి వచ్చిన ప్రధాని మోడీ ఉక్కు మీద ఒక్క మాట చెప్పలేదు, ఉపశమనం కూడా దక్కలేదు.

దాంతో కేంద్రం పట్టుదల ఏమిటి అన్నది అర్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో 1200 రోజుల ఉద్యమం సందర్భంగా జరిగిన సభలో ఉక్కు ఉద్యమ సంఘాలు కేంద్రానికి మరోసారి గట్టి హెచ్చరికను జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో తగ్గాలని డిమాండ్ చేశాయి.

ఉక్కు ఉద్యమ పోరాట కమిటీ చైర్మన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. లేకపోతే మరింతగా ఆందోళన సాగుతుందని హెచ్చరించారు. ఇవన్నీ కేంద్రానికి పడతాయా వారి చెవులకు వినిపిస్తాయా అంటే ఆలోచించాల్సిందే.

విశాఖ ఉక్కు మీద హక్కు ఆంధ్రులకు లేదని మాదే అంతా అని కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో  ఉక్కుకు చెదలు పడుతోంది. ఉక్కు బతుకునూ చిదిమేసేలా  అంతా జరిగిపోతోంది. అయినా ఎక్కడో చిరు దీపంలా ఆశ ఉంది. అదే ఉక్కుకు శ్రీరామ రక్ష అవుతుందని కార్మికులూ ఉద్యమకారులూ భావిస్తున్నారు. ఆ ఆశ కేంద్రంలో ఇండియా కూటమి రావచ్చు అన్నదేనని అంటున్నారు.