ఏపీలో అధికారం ఎవరిది అన్నది ఇపుడు అందరినీ దొలిచేస్తున్న ప్రశ్న. సర్వేలను సైతం ఎవరూ పెద్దగా నమ్మని పరిస్థితి ఉంది. ఎవరికి వారిదే సర్వేలు. అలాగే ఎవరి ధీమా వారిదే. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్ధి పార్టీలు చెప్పే విషయాలు వారు అనుకునే అంశాలే అతి కీలకంగా మారుతాయి.
ఏపీలో అధికారం చేపట్టబోయేది ఎవరు అన్న దాని మీద ఒక రహస్య నివేదికను బీజేపీ కేంద్ర పెద్దలకు సొంత పార్టీ ప్రముఖుదే ఇచ్చారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ ప్రముఖుడు మాజీ ఎంపీ. అంతే కాదు గతంలో ప్రముఖ సెఫాలజిస్టుగా పనిచేశారు. రాజకీయ సర్వేలు దేశానికి మూడు దశాబ్దాల క్రితం పరిచయం చేసిన వారు. అందులో చేయి తిరిగిన వారు.
బీజేపీ అగ్ర నాయకత్వంతో బాగా సాన్నిహిత్యం ఉన్నవారు. ఏపీలో అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉన్న వారు. ఆయన ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత పోస్ట్ పోల్ సర్వేని ఒకటి తానుగా చేసి కేంద్ర పెద్దలకు నివేదించారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రముఖుడు ఇచ్చిన నివేదికలో కూటమికి గల అవకాశాలు ఎంత వైసీపీకి ఎంత అన్నది కూడా స్పష్టంగా వివరించారు అని అంటున్నారు.
దాంతో ఆ నివేదిక చేత బట్టుకుని ఏపీ రాజకీయ పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా ఆయన వివరించారని అలాగే వైసీపీ టీడీపీ కూటమి పెర్ఫార్మెన్స్ కూడా చాలా కూలంకషంగా వివరించారు అని అంటున్నారు. ఆయన సెఫాలజిస్టుగా గతంలో బీజేపీకి అందించిన సర్వేలు పొల్లు పోలేదు కాబట్టి ఆయన నివేదిక మీద కేంద్ర పెద్దలు నమ్మకం ఉంచారని అంటున్నారు.
ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఒక రాజకీయ పార్టీ అయితే ముహూర్తం పెట్టుకుని మరీ ప్రమాణానికి సిద్ధం అవుతోంది. ఇలా సర్వేలను మించిన నివేదికగా దీనిని చూస్తున్నారు. మరి ఈ నివేదికలో ఏముంది అన్నది అయితే సస్పెన్స్. ప్రచారంలో ఉన్న దానిని బట్టి ఒక పార్టీ చేస్తున్న హడావుడిని బట్టి విజేత ఎవరో ఊహించుకోవచ్చు అంటున్నారు.