లీగల్ నోటీసులు అందుకోబోతున్న జనసేన నేత

విశాఖలో ఉన్న జనసేన నేత మీడియా ముందుకు వచ్చి ప్రతీ సారి అనేక మంది మీద ఆరోపణలు చేస్తూంటారు. సాధారణంగా రాజకీయ నేతల మీద ఆరోపణలకు ఎవరూ ఆధారాలు అడగరు. అవి అలా చెల్లిపోతూంటాయి.…

విశాఖలో ఉన్న జనసేన నేత మీడియా ముందుకు వచ్చి ప్రతీ సారి అనేక మంది మీద ఆరోపణలు చేస్తూంటారు. సాధారణంగా రాజకీయ నేతల మీద ఆరోపణలకు ఎవరూ ఆధారాలు అడగరు. అవి అలా చెల్లిపోతూంటాయి. కొందరైతే పట్టించుకోరు కూడా.

అలా ఆరోపణలు తన పరిధి స్థాయిని దాటి మరీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి పైన సదరు జనసేన నేత చేశారు. దాని మీద ఫస్ట్ వార్నింగ్ అన్నట్లుగా జవహర్ రెడ్డి రియాక్ట్ అయి మీడియా ముందు క్షమాపణ చెప్పమన్నారు.

కానీ రెండు రోజులుగా అదే పనిగా అసత్యమైన  నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో త్వరలో ఆ నేతకు లీగల్ నోటీసు జారీ చేయడానికి జవహర్ రెడ్డి సిద్ధం అయ్యారు. వరసగా శని ఆది వారాలలో  విశాఖపట్నంలో ఆ నేత చేసిన అసత్యమైన నిరాధార ఆరోపణలలో వాస్తవం లేదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా రిజాయిండర్ ఇవ్వడమైందని అంటున్నారు.

అయినప్పటికీ సదరు నేత జవహర్ రెడ్డి వారిపై మరొకసారి అవే ఆరోపణలను చేయడం తీవ్రంగా పరిగణించి ఆరోపణలకు సంబంధించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. తొందరలోనే జనసేన నేతకు లీగల్ నోటీసు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

విశాఖలో ఎనిమిది వందల ఎకరాల భూములను జవహర్ రెడ్డి ఆయన కుమారుడు కబ్జా చేశారు అంటూ జనసేన నేత చేస్తున్న ఆరోపణల మీద సీఎస్ సీరియస్ అయ్యారు. తాను విశాఖకు ఒక వివాహ కార్యక్రమం మీద వస్తే దానిని చిలవలు పలవలు చేసి అసత్య ఆరోపణలు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. జనసేన నేతకు లీగల్ నోటీసుల వ్యవహారం ఇపుడు విశాఖలో రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.