రాజకీయం చాలా దూరం వెళ్తోంది అనడం కంటే ఆశలు ఆరాటాలు చాలా ముందుకు వెళ్తున్నాయని అనుకోవాల్సిందే. కౌంటింగ్ ఇంకా జరగలేదు ఒక వైపు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితులు ఉంటే కాబోయే మంత్రులు ఫలానా వారు అని ఇంకో వైపు ప్రచారం సాగుతోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈసారి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల చాన్స్ దక్కుతుంది అని అంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీ కోటాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన పాలకొండకు చెందిన విశ్వసరాయి కళావతికి తప్పకుండా చాన్స్ లభిస్తుంది అని అంటున్నారు. ఆమె ఈసారి విజయం సాధిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లే అంటున్నారు.
ఆమెతో పాటుగా పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి రెండవసారి గెలవడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. ఆమెకు కూడా బలమైన కాపు సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. పాతపట్నం వైసీపీకి కంచుకోట లాంటి సీటు, 2014, 2019లలో వైసీపీ గెలుచుకున్న ఈ సీటులో ఈసారి కూడా ఫ్యాన్ గాలి వీస్తుంది అని అంచనా వేస్తున్నారు.
ఈ ఇద్దరి తరువాతనే ఉత్తరాంధ్రలో మిగిలిన మంత్రుల సంగతి అని అంటున్నారు. ఈసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్శీపట్నం నుంచి పెట్ల ఉమాశంకర్ గెలిస్తే ఆయనకు మంత్రి పదవి తధ్యమని అంటున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఇద్దరు సీనియర్ మంత్రుల పదవులకు ఢోకా లేదు అని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజం తెలియాలంటే జూన్ 4 వరకూ అంతా ఆగాల్సి ఉంటుంది.