కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఏపీ విషయంలో ఎన్నికల కమిషన్ అధికారులు ఏ మాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారని విరుచుకుపడ్డారు. దున్నపోతు ఈనిందంటే… కట్టేయమని చెప్పిన చందంగా ఎన్నికల అధికారులు ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో పోలీసు అధికారులు బరితెగించారని మండిపడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామి అనే సీఐ టీడీపీ సేవలో తరించారని విమర్శించారు. గొడవలను అదుపు చేయడానికి బదులు, బాబు సామాజిక వర్గానికి సీఐతో పాటు మరో ఎస్ఐ ప్రోత్సహించేలా మసులుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఈసీ, పోలీసుల తీరు దుర్మార్గంగా వుందన్నారు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారనుకుంటే, ఆ విషయాన్ని ఎన్నికల అధికారులు ఎందుకు ముందే చెప్పలేదని ఆయన నిలదీశారు. పిన్నెల్లికి సంబంధించిన వీడియో లోకేశ్‌నాయుడు లీక్ చేశారని, దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ అధికారులు ఆదేశించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఏడేళ్లు శిక్ష పడే కేసుల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాలనే ఇంగితం లేదా? అని ఆయన ప్రశ్నించారు. పిన్నెల్లి కేసులో ఇదే విషయాన్ని ఆయన తరపున న్యాయవాది ప్రశ్నించారని గుర్తు చేశారు. అప్పుడు పిన్నెల్లిపై మరో తప్పుడు కేసును పోలీసులు నమోదు చేశారని పేర్ని నాని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం వుందా? అని ఆయన నిలదీశారు. పిన్నెల్లికి సంబంధించిన వీడియో లీక్ కావడంపై ఏపీ సీఈఓ ముకేశ్‌కుమార్ మీనా చెప్పిన భాష బాగా లేదని ఆయన తప్పు పట్టారు.
ఉన్నత చదువులు చదివి, రాజ్యాంగబద్ధమైన పదవిలో కూచున్న వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు అది కాదన్నారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై టీడీపీ వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన నిలదీశారు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదన్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారని ఆయన విమర్శించారు.
టీవీ చానెళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా అంటూ పేర్ని నిలదీశారు. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.