తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ భారీ స్కామ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన సంచలన ఆరోపణ చేశారు.
ఇందులో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు వెళ్లాయని కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్‌తో జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంత వరకు ఏ మేరకు ధాన్యం కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర రూ.42 నుంచి రూ.45 వరకు ఉందన్నారు. దాన్ని పక్కకు పెట్టి రూ.56.90 కి కొంటున్నారని ఆయన ఆరోపించారు.
సివిల్ సప్లైస్, ఎఫ్‌సీఐ ఉన్నప్పటికీ, కేవలం నాలుగు సంస్థలకే టెండర్లు ఎందుకని కేటీఆర్ నిలదీశారు. కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కు అయ్యారని ఆయన ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు సన్నబియ్యం దొరుకుతుంటే, ఎక్కువ ధర పెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోందని ఆయన విమర్శించారు. అలాగే ప్రభుత్వానికి రైతులకు సంబంధించి రూ.2 లక్షల రుణమాఫీ చేసే తెలివి లేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు.