కూటమికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పని చేస్తోందన్నది బహిరంగ రహస్యం. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో కూటమికి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు ఈసీ నిస్సిగ్గుగా వత్తాసు పలికిందని అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ ఈసీ అదే రీతిలో వ్యవహరిస్తుందనే అనుమానాలు అధికార పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి అయిన నెల్లూరు కలెక్టర్‌పై మంత్రి కాకాణి తీవ్ర విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో జిల్లా అధికారి విఫలమయ్యారని ఆరోపించారు.
ఎన్నికల నిధుల దుర్వినియోగం, అలాగే విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పట్టపగలు ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడంపై జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. కానీ ఆయన పట్టించుకోకపోగా, మానవతా దృక్పథంతో సాయం చేశారని రిటర్నింగ్ అధికారి వ్యంగ్యంగా అన్నారని ఆయన వాపోయారు.
రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని మంత్రి కాకాణి హెచ్చరించారు. పక్షపాత ధోరణితో పని చేస్తున్న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. కౌంటింగ్‌కు ఒక అబ్జర్వర్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.