టాలీవుడ్ లో పిల్లలను లేదా వారసులను లాంచ్ చేయడం అంటే అంత సులవు కాదు. దాని చాలా ప్లానింగ్ కావాలి. అదృష్టం కలిసిరావడం అన్నది వేరే సంగతి. కానీ ఈ పని టాలీవుడ్ లో చాలా మంది పేరెంట్స్ చేయరు. తమ మొహమాటం వాడి, తమ చేతికి పెద్దగా ఖర్చు అంటకుండా చేసుకుంటూ వస్తారు. ఒక్క బెల్లంకొండ సురేష్ మాత్రమే తన కొడుకును సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసారు. హిట్ లు పడ్డాయా లేదా అన్నది పక్కన పెడితే నిలదొక్కుకోవడానికి పనికి వచ్చేలా ప్లానింగ్ చేసారు.
అక్కినేని నాగార్జున తన కొడుడు అఖిల్ కోసం సరిగ్గా ప్లానింగ్ చేయలేకపోయారనే చెప్పాలి. తొలి సినిమాను నితిన్ నిర్మాతగా చేసాడు. మరి సినిమా నాగ్ హోమ్ బ్యానర్ లో చేసారు. సరైన కథలు, దర్శకులను తీసుకురావడం జరగలేదు. అల్లు శిరీష్ విషయంలో అల్లు అరవింద్ కూడా పెద్దగా సీరియస్ నెస్ కనబర్చినట్లు లేదు. మారుతితో, పరుశురామ్ తో రెండు సినిమాలు ప్లాన్ చేసారు. ఆ తరువాత మరి ఆపేసారు.
నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ విషయంలో సరైన ప్లానింగ్ జరుగుతున్నట్లు లేదు. నిర్మాత దిల్ రాజు ఎంతో మంది దర్శకులను పరిచయం చేసారు. వారంతా మంచి పొజిషన్ లలో వున్నారు. వాళ్లను దిల్ రాజు వాడుకోవడం లేదు. దిల్ రాజు తలుచుకుంటే పెద్ద దర్శకుడు, పెద్ద కథ తీసుకురాగలరు. కానీ ఎందుకో ఆ దిశగా ఆలోచంచడం లేదు.
నితిన్ ను హీరోగా నిలబెట్టేవరకు తండ్రి సుధాకరరెడ్డి ఎన్ని సినిమాలు ప్లాన్ చేయించారు. దాదాపు అందరు పాపులర్ డైరక్టర్ లతో సినిమాలు చేయించారు. దాని వల్ల ఆయన తన డిస్ట్రిబ్యూషన్ కూడా దాదాపుగా తగ్గించేసుకున్నారు.
నిర్మాత దానయ్య కూడా దిల్ రాజు మాదిరే. మంచి దర్శకుడు, మంచి ప్రాజెక్ట్ వస్తే లెక్కలు, లాభాలు చూసుకుని, వేరే హీరో దగ్గరకు వెళ్లిపోతున్నారు. లాభాలు పక్కన పెట్జి, మంచి ప్రాజెక్టును కొడుక్కు ఇవ్వాలి అని నిర్మాత అనుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు.
సురేష్ బాబు అయితే అన్ని వేల కోట్లు వుండి కూడా రానా మీద కానీ రెండో కొడుకు అభిరామ్ మీద కానీ పెట్టుబడి పెట్టి సినిమాలు తీయలేదు. తీయరు కూడా.
ఏదో కథ వస్తే ఎగ్జయిట్ అవుతున్నారు. చేయిస్తున్నారు. బాగా వస్తే సరేసరి, లేదంటే పక్కన పెడుతున్నారు. లేదూ అంటే రిపేర్లు చేసి వదలుతున్నారు. ఈ రేంజ్ వర్క్ సరిపోదు ఆశిష్ ను హీరోగా నిలబెట్టడానికి. ప్లానింగ్ అంతా దిల్ రాజు ది కనుక ఆశిష్ తండ్రి శిరీష్ ఏమీ మాట్లాడడం లేదు. కానీ నిజానికి పెద్ద దర్శకులతో తన కొడుకును హీరోగా పెట్టి సినిమా చేయాలని శిరీష్ కు వంది. ఆ సంగతి సన్నిహితులు ప్రస్తావిస్తే ‘రాజన్న’కు చెప్పండి అంటారు తప్ప తాను ముందుకు వెళ్లరు.
తొలి సినిమాకు మ్యూజిక్ ప్రాణం. దేవీశ్రీని తీసుకున్నారు. కానీ సరైన పాటలు పూర్తిగా తీసుకోలేకపోయారు. మలి సినిమా స్టార్ట్ చేసి ఆపేసారు. మూడో సినిమా లవ్ మీ కథ దగ్గరకు వచ్చినపుడు కూడా దిల్ రాజు ఆ కథ ను మరో యంగ్ అప్ కమింగ్ హీరో దగ్గరకు తీసుకెళ్లారని తెలుస్తోంది. అక్కడ సానుకూల సమాధానం రాకపోతే, అప్పుడు ఆశిష్ తో ప్లాన్ చేసారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
దిల్ రాజు దగ్గర ఆస్ధాన కవులు కొంత మంది వున్నారు. ఏ కథ అయినా, ఏ స్క్రిప్ట్ అయినా మరమ్మతులు, మార్చడం ఇలాంటివి అన్నీ వాళ్ల సలహా సూచనలతోనే. వాళ్లు అవుట్ డేట్ అయిపోయారు. కొత్తగా ఆలోచించడం, క్వాలిటీని తీసుకురావడం కుదరడం లేదు. కానీ దిల్ రాజు ఇంకా వాళ్లనే నమ్ముకుంటారు.
దిల్ రాజుకు వర్క్ లోడ్ ఎక్కువ వున్నా, ప్రాజెక్ట్ ఓకె చేసిన తరువాత స్వంత ఇంటి హీరో కనుక పూర్తిగా దాని మీద దృష్టి పెట్టాల్సి వుంది. స్టార్ట్ టు ఎండ్ అలా దృష్టి పెడితేనే సరైన ప్రొడెక్ట్ రావడం సాధ్యం అవుతుంది. కుర్రాళ్లు కదా అని పిల్లల మీద ప్రాజెక్ట్ వదిలేయడం సరి కాదు. అనుభవం అనుభవమే.
ఇకనైనా దిల్ రాజు- శిరీష్ తన ఇంటి హీరో కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. వ్యాపారం లెక్కలు పక్కన పెట్టి, పెట్టుబడి అనుకుని పెద్ద దర్శకులతో సినిమాలు తీయించాలి. నిలబెట్టాలి. లేదూ అంటే అల్లు శిరీష్ మాదిరిగా అరకొరగా మిగిలిపోయే ప్రమాదం వుంది.